మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేటలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలలో  ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 
రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్వేత మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా రాఖీ పండుగ కేవలం అన్నాచెల్లెళ్లకు, అక్క తమ్ముళ్లకే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ ‘నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. మనం ఇద్దరం దేశానికి రక్ష’ అనే సామాజిక సృహ ఉండాలని అన్నారు. అందరూ కలిసి దేశ ఐక్యమత్యాన్ని చాటాలని ఏబీవీపీఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వివేక్, అక్షయ్, మనీశ్, పవన్, రాకేశ్, అబ్బాస్, నూర్ తదితరులు
పాల్గొన్నారు.

హార్డ్​ వర్క్​తోనే సక్సెస్​ :నోవార్టీస్​ డైరెక్టర్​ సుభాష్​చంద్ర
రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  హార్డ్​ వర్క్​తోనే విజయం సాధించగలమని హైదరాబాద్​ నోవార్టీస్ డైరెక్టర్ సుభాష్​ చంద్ర మహాపాత్ర అన్నారు. పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్శిటీ ఇంజినీరింగ్, మేనేజ్​మెంట్ స్టూడెంట్స్​తో గురువారం జరిగిన ఇంటరాక్షన్​ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. ఫ్యూచర్ ​ఇంజినీర్లు, మేనేజర్లు కష్టపడి పనిచేయాలని, ఉన్నతంగా చదువుకోవాలని సూచించారు. చేస్తున్న పని విషయంలో అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడానికి వెనుకాడకూడదన్నారు. కార్యక్రమంలో గీతం కెరీర్​డెవలప్​మెంట్ ఆఫీసర్ ​డాక్టర్​ రమాకాంత్ బాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్​డాక్టర్ రియాజుద్దీన్, వివిధ బ్రాంచ్​ల ఇంచార్జీలు 
పాల్గొన్నారు. 

సైబర్ నేరాల అదుపు కోసమే ‘అంబాసిడర్లు’

మెదక్ టౌన్/సంగారెడ్డి టౌన్/సిద్దిపేట రూరల్, వెలుగు : సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా సైబర్ అంబాసిడర్ల ను సిద్ధం చేసినట్లు మెదక్​ కలెక్టర్ హరీశ్, సిద్దిపేట సీపీ శ్వేత, సంగారెడ్డి అడిషనల్​ ఎస్పీ మధుకర్​ స్వామి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రాల్లో ఉమెన్ సేఫ్టీవింగ్ తెలంగాణ పోలీస్, ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​లు సంయుక్తంగా నిర్వహించిన సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సెల్ ఫోన్ వినియోగం, నెట్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అందుకోసం సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. సైబర్ నేరాల పై అవగాహన కల్పించేందుకు ఆయా ప్రభుత్వ స్కూళ్ల నుంచి  కొంతమంది స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇప్పించి వారిని సైబర్ అంబాసిడర్లగా తయారు చేసినట్లు తెలిపారు.  ఆన్​లైన్​లో మహిళలు, పిల్లలే లక్ష్యంగా వేధింపులు, మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసు సిబ్బంది ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సైబర్ అంబాసిడర్లుగా  ఉత్తమ సేవలందించిన విద్యార్థులకు మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న కేసీఆర్

బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​రెడ్డి
సిద్దిపేట/కోహెడ(హుస్నాబాద్​), వెలుగు :  హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సీఎం కేసీఆర్​ వ్యవహరిస్తున్నరని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​రెడ్డి ఆరోపించారు. మొహర్రం పండుగకు ఆప్షనల్ సెలవు ప్రకటించి రాఖీ పండుగకు సెలవు ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం సిగ్గు చేటన్నారు. వెంటనే ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్​ను ఉపసంహరించుకొని సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే స్కూళ్లను బైకాట్​చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు కోహెడ మండలం గొట్లమిట్ట, నారాయణపూర్, హుస్నాబాద్​లో హార్​ ఘర్​ తీరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలను పంపిణీ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి దొడ్డి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి విద్యాసాగర్, మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం, పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు, సర్పంచ్​మ్యకాల చంద్రశేఖర్​రెడ్డి, ఎంపీటీసీ ద్యాగటి సురేందర్, నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, మధుకర్, చేపూరి తిరుపతి పాల్గొన్నారు.

ఆప్షనల్ సెలవుకు అడ్డంకులు కలిగించొద్దు 
దేశవ్యాప్తంగా  నిర్వహించుకునే రాఖీ పండుగకు సాధారణ సెలవు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఆప్షనల్ లీవు వినియోగించుకోకుండా అడ్డంకులు సృష్టించడం తగదని  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్)  జిల్లా అధ్యక్షుడు  బీరకాయల తిరుపతి అన్నారు. ఈ విషయంపై గురువారం సిద్దిపేట డీఈవోకు వినతిపత్రం అందజేశారు.  కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఊడెం రఘువర్ధన్ రెడ్డి,  జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మురళి పాల్గొన్నారు. 

ప్రగతి భవన్ ముట్టడిస్తాం..
నారాయణ్ ఖేడ్/పాపన్నపేట, వెలుగు : వీఆర్ఏలకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, లేకపోతే  ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సాయిలు హెచ్చరించారు. గురువారం నారాయణఖేడ్ లో  వీఆర్ఏల ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు ఎస్.చిరంజీవి, వీఆర్ఏల సంఘం నాయకులు ఖాజా, సుభాష్ , మల్లప్ప, సాయిలు, సూర్యకాంత్, కిరణ్, పండరి, వినోద్, సంజీవులు, వివిధ మండలాల వీఆర్ఏలు పాల్గొన్నారు.  


రోడ్డెక్కినా పట్టించుకోరా

పాపన్నపేట : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్​ఏలు రోడ్డెక్కినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం వారు కాంగ్రెస్ కార్య కర్తలతో కలసి వీఆర్ఏల దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు. 

టీఆర్ఎస్ లో చేరికలు 
సిద్దిపేట, వెలుగు :  నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన బీజెపీ, కాంగ్రెస్ నేతలు పలువురు గురువారం హైదరాబాద్ లో మంత్రి హరీశ్​ రావు సమక్షంలో టీఆర్ఎస్​ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ ఫేక్ ప్రచారానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిస్తే, భవిష్యత్తు లేక కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కానున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 

నాణేలతో భారీ రాఖీ 
గజ్వేల్, వెలుగు : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్​ పట్టణంలో15 వేల  విలువైన నాణేలతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని పట్టణానికి చెందిన రామకోటి రామరాజు గురువారం రూపొందించారు. ఈ రాఖీ స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. పలువురు ఆయనను అభినందించారు. 

టీఆర్ఎస్ లో చేరికలు 
సిద్దిపేట, వెలుగు :  నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన బీజెపీ, కాంగ్రెస్ నేతలు పలువురు గురువారం హైదరాబాద్ లో మంత్రి హరీశ్​ రావు సమక్షంలో టీఆర్ఎస్​ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ ఫేక్ ప్రచారానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిస్తే, భవిష్యత్తు లేక కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కానున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 

జిల్లా వ్యాప్తంగా ఫ్రీడమ్​ రన్​
వెలుగు, నెట్​వర్క్​: దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఫ్రీడమ్​ రన్​ నిర్వహించారు. పలుచోట్ల భారీ జాతీయ పతకాలను ప్రదర్శించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాలో కలెక్టర్లు హరీశ్, ప్రశాంత్​ జీవన్​పాటిల్, డాక్టర్​ శరత్​ ర్యాలీలో పాల్గొన్నారు.  సిద్దిపేటలో ఫ్రీడమ్ రన్ ను జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ జెండా ఊపి ప్రారంభించారు. నారాయణఖేడ్​లో ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. థియేటర్లలో ప్రదర్శిస్తున్న గాంధీ సినిమాను విద్యార్థులు తప్పకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు, సీపీ, ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ, డీఆర్​డీఓ, డీపీవో, డీఈవో, జిల్లా యువజన క్రీడల అధికారులతోపాటు పలువురు లీడర్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో 
పాల్గొన్నారు. 

ఘనంగా తీజ్ పండుగ
కోహెడ (హుస్నాబాద్​), వెలుగు: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతుల్, మైసమ్మవాగు తండాలలో గురువారం తీజ్​ పండుగను గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. గోధుమ మొలకలు వచ్చిన బుట్టలను తలపై ఎత్తుకుని ఆట, పాటలతో ఊరేగింపుగా వెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​రెడ్డి, జన్నపురెడ్డి సురేందర్​రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మోహన్​నాయక్, భాస్కర్​నాయక్, వంశీధర్​రెడ్డి, రాజు, రైనా పాల్గొన్నారు.

కేంద్ర పథకాలపై అవగాహన
కోహెడ(బెజ్జంకి), వెలుగు: మండలంలోని దాచారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై కిసాన్​ మోర్చా రాష్ర్ట కార్యదర్శి మహిపాల్​రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం చేశారు. గరీబ్​ కల్యాణ్​ యోజన, పీఎం కిసాన్​యోజన, ఉజ్వల యోజన, ఆవాస్ యోజన, ముద్ర లోన్, స్వచ్ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ స్కీంలపై ప్రజలకు వివరించారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ కొలిపాక రాజు, సత్యనారాయణ, ముత్యం, లక్ష్మణ్, మహిపాల్, వరప్రసాద్, రాకేశ్​ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో జింక మృతి
జగదేవపూర్(కొమురవెల్లి ), వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఓ జింక మృతి చెందింది. ఈ ఘటన జగదేవపూర్ మండలంలోని గొల్లపల్లి కాటన్ మిల్లు సమీపంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గొల్లపల్లి వద్ద గుర్తుతెలియని వాహనం  ఢీ కొట్టడంతో జింక అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.