
ప్రముఖ సింగర్ రక్షిత సురేశ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆదివారం ఉదయం మలేషియాలో ఎయిర్‌పోర్టుకి వెళ్తున్న సమయంలో.. దురదృష్టవశాత్తు ఆమె కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ వల్ల ఆమె ఈ ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడింది. ఇక ఈ సంఘటన గురించి ఆమె ట్విటర్ ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో తన కళ్లముందు జీవితమంతా మెదిలిందని, ఎయిర్‌బ్యాగ్స్ ఉండటం వల్లనే ఈ పెను ప్రమాదం నుంచి బతికి బయటపడ్డానని చెప్పుకొచ్చింది.
‘‘నేను పెద్ద ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాను. ఆదివారం ఉదయం మలేషియా విమానాశ్రయానికి వెళ్తుండగా.. నా కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో నా జీవితమంతా కళ్లముందు మెదిలింది. కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ నా ప్రాణాలు కాపాడాయి. ఒకవేళ అవి లేకపోయి ఉంటే, పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ సంఘటనని తలచుకుంటే, ఇప్పటికీ నా శరీరం వణుకుతోంది. ఈ ప్రమాదంలో నేను, డ్రైవర్, మరో ప్యాసింజర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాం. చావు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడినందుకు మేము అదృష్టవంతులం’’ అంటూ రాసుకొచ్చింది.
కాగా.. 2009లో రిథమ్ తధిమ్, లిటిల్ స్టార్ సింగర్ విజేతగా నిలిచిన రక్షిత సురేశ్.. సూపర్ సింగర్ 6 రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచింది. ఇక తమిళ స్టార్ హీరో శింబు, హిప్‌హాప్ తమిళ కాంబోలో వచ్చిన వంత రాజువదాన్ వరువెన్ అనే సినిమాతో గాయనిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇక అప్పటినుండి తమిళం, హిందీ, కన్నడ, తెలుగు సినిమాల్లో చాలా పాటలు పాడింది. ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ పొన్నియన్ సెల్వన్ 2లోనూ పాడింది రక్షిత సురేశ్.