
సినిమా తారలు, క్రీడా ప్రముఖులు దేశ ప్రధానిని కలవడం అనేది ఎప్పుడూ ఆసక్తికర విషయమే. లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. శనివారం ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. అయితే, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు. ఒక ముఖ్యమైన క్రీడా కార్యక్రమం విజయం సాధించిన సందర్భంగా జరిగిన సమావేశం కావడం విశేషం.
చరిత్రలో తొలిసారి ఆర్చరీ ప్రీమియర్ లీగ్!
భారతదేశంలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ వంటి క్రీడలకు లీగ్‌లు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. అయితే భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా రామాయణ, మహాభారత కాలం నుంచీ మనకు తెలిసిన విలువిద్య (Archery)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా ఈ ఏడాది తొలిసారిగా 'ఆర్చరీ ప్రీమియర్ లీగ్' (APL)ను లాంచ్ చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ లీగ్‌ను ఇటీవల ఢిల్లీలో రామ్ చరణ్ స్వయంగా ప్రారంభించారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి టీమ్స్ పోటీపడ్డాయి
ఈ మెగా ఈవెంట్ విజయవంతం కావడం, క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దక్కిన విజయాన్ని పురస్కరించుకుని... లీగ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అనిల్ కామినేనితో కలిసి రామ్ చరణ్, ఉపాసనలు ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా.. లీగ్ విజయవంతం కావడానికి గల కారణాలను, భవిష్యత్తులో ఆర్చరీ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారిని అభినందించారు.
ప్రధానిపై చరణ్ పోస్ట్
ప్రధానిని కలిసిన అనంతరం రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నాను.. క్రీడల పట్ల ప్రధానమంత్రి మార్గదర్శకత్వం, అభిరుచి, ప్రపంచవ్యాప్తంగా విలువిద్య వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి మాకు సహాయపడుతుంది. క్రీడాకారులందరికీ అభినందనలు— మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యం కోసం మరింత మంది ఈ అద్భుతమైన క్రీడలో చేరాలని ఆశిస్తున్నామని అని చరణ్ పేర్కొన్నారు.
ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ చిత్రం 'పెద్ది' చేస్తున్నారు. గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ మార్చిలో రిలీజ్ కానుంది.