క్రేజీ కాంబో రిపీట్

క్రేజీ కాంబో రిపీట్

‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత శంకర్ డైరెక్షన్‌‌లో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌లో చరణ్ నటించాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌‌ ఉంటుందా లేదా అనే విషయంపై రకరకాల వార్తలొస్తున్నాయి. ఈలోపు చరణ్ కొత్త సినిమా విషయంపై మరో అప్‌‌డేట్ తెరపైకొచ్చింది. ఓ వైపు అల్లు అర్జున్‌‌తో ‘పుష్ప 2’ తీస్తోన్న సుకుమార్, మరోవైపు రామ్‌‌ చరణ్‌‌తోనూ ఓ భారీ సినిమా ప్లాన్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్‌‌ ఇంట్రడక్షన్ సీన్స్‌‌ షూటింగ్ పూర్తయిందట. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరీల్‌‌ ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

దాదాపు పది నిమిషాల పాటు ఈ సీన్స్ ఉంటాయని ఆయన చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ టైమ్‌‌లో చరణ్ మేకోవర్‌‌‌‌ చూసిన సుకుమార్, తన సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్‌‌కి అలాగే ఉండాలని భావించి, అప్పుడే కొన్ని సీన్స్ తీశాడట. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌‌లో ‘సుకుమార్ సినిమాలో చరణ్ ఇంట్రడక్షన్‌‌ ఏ స్థాయిలో ఉంటుందో నాకు తెలుసు’ అంటూ ఊరించారు రాజమౌళి. అయితే ఆ సీన్స్ షూటింగ్‌‌ కూడా కంప్లీట్ అయిన విషయం మాత్రం ఇప్పుడే రివీల్ అయింది. మొత్తానికి ‘రంగస్థలం’ లాంటి భారీ సక్సెస్‌‌ఫుల్ మూవీ తర్వాత మరోసారి చరణ్, సుకుమార్ కాంబినేషన్‌‌లో సినిమా రాబోతోంది.  అయితే శంకర్ సినిమా తర్వాత చరణ్ నటించబోయేది ఇదేనా లేక మధ్యలో మరో చిత్రంలో నటిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.