RC17 Movie: నవంబర్ 1న RC17 గ్రాండ్ లాంచ్.. రామ్ చరణ్ – సుకుమార్ కాంబోపై తబితా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

RC17 Movie: నవంబర్ 1న RC17 గ్రాండ్ లాంచ్..  రామ్ చరణ్ – సుకుమార్ కాంబోపై తబితా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ మళ్లీ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమైంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న RC17పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 1న హైదరాబాద్‌లో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని వెల్లడించడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది.

మరోవైపు సినిమా ప్రారంభానికి ముందే సుకుమార్ భార్య తబితా సుకుమార్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ ఎంతో కష్టపడ్డారని, కథ రచనలో ఎన్నో గంటలు శ్రమించారని ఆమె పేర్కొన్నారు. రామ్ చరణ్, సుకుమార్ లాంటి అభిమానులు ఇష్టపడే కాంబినేషన్ మరోసారి కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. గత సినిమాల షూటింగ్స్, ప్రమోషన్లకు సంబంధించిన వీడియోలతో రూపొందించిన ప్రత్యేక కొలాజ్‌ను కూడా ఆమె షేర్ చేశారు.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. అయితే సంగీత దర్శకుడి విషయంలో మాత్రం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు సుకుమార్ సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో ఈసారి అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు ఈ సినిమా కోసం రామ్ చరణ్ భారీ మేకోవర్‌కు సిద్ధమవుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సుమారు 15 కిలోల బరువు తగ్గడంతో పాటు లాంగ్ హెయిర్‌తో కొత్త లుక్‌లో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. స్క్రిప్ట్, క్లైమాక్స్‌పై కూడా సుకుమార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరి 'రంగస్థలం' మ్యాజిక్‌ను మించేలా ఈసారి సుకుమార్ ఎలాంటి కథతో రాబోతున్నారు? RC17 పూజా కార్యక్రమంలో హీరోయిన్, సంగీత దర్శకుడి వివరాలు వెల్లడవుతాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.