అంతా రామమయం.. 100కు పైగా టెస్లా కార్లతో లైట్ షో

అంతా రామమయం.. 100కు పైగా టెస్లా కార్లతో లైట్ షో

అయోధ్యలో చారిత్రాత్మకమైన రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని గంటల సమయమే ఉంది. ఈ సందర్భంగా హ్యూస్టన్‌లోని భారతీయ అమెరికన్ భక్తులు వినూత్నంగా రామ భక్తిని చాటుకున్నారు. టెస్లా కార్ లైట్ షోను ప్రదర్శించారు. 100 మందికి పైగా టెస్లా కార్ల యజమానులు తమను తాము రామ్‌జీ కి గిలహరియన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ గా అభివర్ణించుకున్నారు. జనవరి 19న సాయంత్రం శ్రీ గురువాయూరప్పన్ కృష్ణ దేవాలయంలో లైట్ షో కోసం సమావేశమయ్యారు. రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా సంతోషాన్ని తమదైన శైలిలో తెలిజేశారు. మంత్రముగ్ధులను చేసే ప్రదర్శన వందలాది మంది రామభక్తులను, చుట్టుప్రక్కల బాటసారులను ఆకర్షించింది.

ఈ సంఘటనకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుండగా.. ఇందులో వంద కార్లు  పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి ఉన్నాయి. కొందరు ఉద్యోగులు కూడా ఆ పార్కింగ్ ప్లేస్ లో ఉన్నారు. జై శ్రీ రామ్.. జై శ్రీ రామ్ అనే సాంగ్ బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతుండగా.. కార్ల నుంచి బీట్ కు అనుగుణంగా లైట్స్ వేశారు. టెస్లా కార్ డ్రైవర్‌లు సాంగ్ కు అనుగుణంగా హెడ్‌లైట్‌లను ఒకే సమయంలో ఆఫ్, ఆన్ చేస్తూ రామ్ అనే అక్షరాలు వచ్చే విధంగా లైట్స్ ను వెలిగిస్తూ.. ఆర్పుతూ లైట్ షో నిర్వహించారు.

ఇది ముగిసిన వెంటనే, భక్తులు హారతి కోసం ఆలయంలో సమావేశమయ్యారు. ఇతర భక్తులతో కలిసి రాముడు, కృష్ణుడికి సంబంధించిన భజనలు పాడారు. ఆ తర్వాత భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. టెస్లా లైట్ షో నిర్వాహకుల ప్రకారం.. ఈ షోలో పాల్గొనే కార్ల యజమానులు ఈవెంట్ కోసం ముందుగానే నమోదు చేసుకున్నారని తెలిపారు.