రామ మందిరం కడతాం.. జాగా మాకే ఇవ్వండి..!

రామ మందిరం కడతాం..  జాగా మాకే ఇవ్వండి..!

సుప్రీంకోర్టులో ‘రామ్​లల్లా విరాజ్​మాన్’ లాయర్ల అఫిడవిట్
వివాదాస్పద ప్రాంతంలో మసీదు నిర్మాణం చట్ట విరుద్ధం
ఆ స్థలం విభజించకూడని ప్రాంతం 
ముస్లింలు, నిర్మోహీ అఖాడాలకు ల్యాండ్ ఇవ్వొద్దని విజ్ఞప్తి

న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్యలోని రామ జన్మభూమి–బాబ్రీ మసీదు భూవివాదం కేసులో ‘రామ్​లల్లా విరాజ్​మాన్’ తరఫు లాయర్లు శనివారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రాముడి గుడి కట్టేందుకు అప్పగించాలని అందులో కోరారు. ‘‘ముస్లిం పిటిషనర్లకు స్థలంపై ఎలాంటి హక్కు ఉండదు. అందుకు సమానంగా వారికి ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ బాబ్రీ మసీదే లేదు” అని పిటిషన్​లో పేర్కొన్నారు. రాముడు పుట్టిన ప్రదేశాన్ని ప్రశ్నించినందువల్ల నిర్మోహీ అఖాడాకు కూడా ల్యాండ్​ను కేటాయించవద్దని కోరారు.

విభజించకూడని స్థలం అది..

‘‘అయోధ్య అనేది ఒక పవిత్ర స్థలం. తీర్థయాత్రల ప్రాంతం. అక్కడ ఇప్పుడు రాముడి గుడి, విగ్రహం లేకున్నా.. ఎన్నో ఏళ్లుగా హిందువులకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న ప్రదేశం” అని అఫిడవిట్​లో హిందూ గ్రూప్ పేర్కొంది. ‘‘వివాదాస్పద స్థలంలో మసీదును మళ్లీ నిర్మించడం అన్యాయం, అనుచితం, హిందూ ధర్మానికి విరుద్ధం. ఇస్లామిక్ చట్టానికి, అన్ని న్యాయ సూత్రాలకు వ్యతిరేకం. వివాదం తలెత్తిన ప్రాంతమంతా కలిపి ఒక యూనిట్. విభజించకూడనిది. మొత్తం ఏరియాను రామ జన్మస్థానంలో పూజలు చేసుకునేందుకు కేటాయించాలి” అని కోరింది.

ఎన్నో ఏళ్లుగా..

ఏళ్లపాటు కొనసాగిన అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ​ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ విచారణ పూర్తిచేసింది. తుది విచారణ మొత్తం 40 రోజుల్లో ముగిసింది. తర్వాత తీర్పును రిజర్వ్​లో ఉంచుతున్నట్లు సీజేఐ తెలిపారు. వాదనలు పూర్తయ్యాయి కాబట్టి పిటిషనర్లు ఇంకేదైనా చెప్పాలనుకుంటే.. రాతపూర్వకంగా నివేదనల్ని సమర్పించవచ్చని కోర్టు అనుమతిచ్చింది. మూడ్రోజుల్లోగా వాటిని సమర్పించాలని గడువు విధించింది. దీంతో శనివారం ‘రామ్​లల్లా విరాజ్​మాన్’ తరఫు లాయర్లు అఫిడవిట్ దాఖలు చేశారు. నవంబర్ 17న సీజేఐగా గొగొయ్ రిటైర్ కానుండటంతో ఆలోపే తీర్పు వెల్లడించే అవకాశముంది. ఇందుకోసం జస్టిస్ గొగొయ్ తన విదేశీ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. మరోవైపు అయోధ్యలో 144 సెక్షన్ పెట్టారు. విచారణ పూర్తి కావడం, త్వరలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది.

‘తీర్పు అనుకూలంగా వస్తే.. మసీదు కట్టడం లేటవుతది’

రామ జన్మభూమి–బాబ్రీ మసీదు భూవివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే.. మసీదు నిర్మాణం ఆలస్యంగా ప్రారంభిస్తామని కొందరు ముస్లిం లిటిగెంట్లు అన్నారు. దేశంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకే దీనిపై ఆలోచిస్తున్నామని చెప్పారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితి చూస్తే.. తమ తొలి ప్రాధాన్యం మత సామరస్యానికేనని లిటిగెంట్ హాజీ మెహబూబ్ తెలిపారు. ‘‘తీర్పు మాకు అనుకూలంగా వస్తే వివాదాస్పద స్థలంలో మేం వెంటనే మసీదు నిర్మించం. చుట్టూ ఓ ప్రహరీ గోడ కట్టి వదిలేస్తాం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దీనిపై ఇతర లిటిగెంట్లతో చర్చిస్తాం” అని వివరించారు. హాజీ మెహబూబ్ ఆలోచనలకు.. ఇతర లిటిగెంట్లు ముఫ్తీ హస్బుల్లా బాద్షా ఖాన్, మొహమ్మద్ ఉమర్ అంగీకరించారు. మెయిన్ లిటిగెంట్ ఇక్బాల్ అన్సారీ మాత్రం.. ఈ ప్రపోజల్​పై స్పందించలేదు. ‘ముందు తీర్పు రానివ్వండి’ అని కామెంట్ చేశారు.