అహో అయోధ్య .. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామజన్మభూమి

అహో అయోధ్య ..  సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామజన్మభూమి

 

  • సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామజన్మభూమి
  • ఎటుచూసినా భక్తజనం, కాషాయ జెండాలు 
  • నగరమంతా రామమయం
  •     ఎటుచూసినా పోస్టర్లు, కాషాయ జెండాలు 
  •     రామనామంతో హోరెత్తుతున్న మైకులు
  •     గుడితోపాటు వీధులన్నీ రంగులమయం

అయోధ్య ఆలయంలో రామయ్య విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ ఘడియలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే గర్భగుడిలోకి చేరిన రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహానికి సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు నిర్వహించనున్నారు. వారం రోజుల ముందు నుంచే ఒక్కో క్రతువు పూర్తి చేసుకుంటూ వస్తున్న వేద పండితులు చివరి ఘట్టాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సిటీ అంతటా ఎటు చూసినా శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రామాయణ దృశ్యాలతో పోస్టర్లు వెలిశాయి. చౌరస్తాల్లో శ్రీరాముడి కటౌట్లను ఏర్పాటు చేశారు. వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. నగరమంతటా మైకుల నుంచి రమ్యమైన రామనామం వీనులవిందు చేస్తున్నది. రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతున్నది.


అయోధ్య ఆలయంలో రామయ్య కొలువుదీరే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే గర్భగుడిలోకి చేరిన రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహానికి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. సంప్రదాయబద్ధంగా వారం రోజుల ముందు నుంచే ఒక్కో క్రతువు పూర్తి చేసుకుంటూ వస్తున్న వేద పండితులు చివరి ఘట్టాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో అయోధ్య నగరమంతా రామమయం అయిపోయింది. సిటీ అంతటా ఎటు చూసినా శ్రీరాముడు, సీత, హనుమంతుడు, రామాయణ దృశ్యాలు, శ్లోకాలు, జైశ్రీరామ్ నినాదాలతో పోస్టర్లు వెలిశాయి. ప్రధాన చౌరస్తాల్లో భారీ ఎత్తున శ్రీరాముడి కటౌట్లను ఏర్పాటు చేశారు. వీధులన్నీ కాషాయ జెండాలతో కనువిందు చేస్తున్నాయి. ఎక్కడికెళ్లినా సమీపంలోని గుడిలోంచి రమ్యమైన రామనామం వీనులవిందు చేస్తోంది. రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది. రాముడి ఆలయాన్ని అందమైన పూలతో అలంకరించడంతో గుడి మరింత శోభాయమానంగా మారింది. వీధులు ఎటు చూసినా అందమైన రంగవల్లులు, రంగురంగుల పూలు, కలర్ లైటింగ్స్, దీపాలంకరణలతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. 

వేల మందికి ఉచిత భోజనం

ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు వస్తున్న భక్తులకు ఉచిత భోజనం అందించేందుకు అనేక చోట్ల కమ్యూనిటీ కిచెన్లు వెలిశాయి. ఇస్కాన్, మహవీర్ టెంపుల్ ట్రస్టులతోపాటు నిహాంగ్ సిఖ్స్, ఇతర సంస్థలు కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేశాయి. తాము రోజూ 10 వేల మంది భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తున్నామని మహవీర్ ట్రస్టు వెల్లడించింది. ఇస్కాన్ తరఫున రోజూ 5 వేల మంది భక్తులకు వంటలు సిద్ధం చేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది.

తూర్పున ఎంట్రీ.. దక్షిణాన ఎగ్జిట్

శ్రీరాముడి ఆలయం మూడంతస్తులతో నిర్మాణం కానుంది. మొదటి విడతలో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తి కాగా, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ నిర్మాణ పనులను మిగతా విడతల్లో పూర్తి చేస్తామని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు. భక్తులు రామాలయం లోకి తూర్పు దిక్కు నుంచి ప్రవేశించి, దక్షిణ దిక్కు నుంచి బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. సంప్రదాయబద్ధమైన నాగర్​ శైలిలో 392 పిల్లర్లు, 44 గేట్లతో నిర్మించినట్లు తెలిపారు. రాముడి గుడిని వెయ్యేండ్లకుపైగా నిలిచిపోయేలా ఐరన్, స్టీల్ వాడకుండా నిర్మిస్తున్నట్లు గుడి నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

శుభ ఘడియలు వచ్చేశాయ్

అయోధ్యలో వీధులన్నీ రాముడి పోస్టర్లతో నిండిపోయాయి. శుభ్ ఘడి ఆయీ (శుభ ఘడియలు వచ్చేశాయి), తయార్ హై అయోధ్య ధామ్, విరాజేంగే శ్రీరామ్( శ్రీరాముడికి స్వాగతం చెప్పేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది), రామ్ ఫిర్ లౌటేంగే (రాముడు తిరిగి వస్తున్నాడు), అయోధ్య మే రామ్ రాజ్య (అయోధ్యలో రామరాజ్యం) అంటూ నినాదాల తో పోస్టర్లు వెలిశాయి. అయోధ్యకు వచ్చే భక్తుల కు స్వాగతం పలుకుతూ సరయూ నది తీరంలో, రామ్ మార్గ్​లో, లతా మంగేష్కర్ చౌక్ లో పోస్టర్లు అతికించారు. పలుచోట్ల భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, రోజూ సాయంత్రం రామాయణాన్ని ప్రదర్శిస్తున్నారు.

అమెరికాలో 1000 టెంపుల్స్ లో వేడుకలు

వాషింగ్టన్:  అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లోని టెంపుల్స్ లోనూ పెద్ద ఎత్తున వేడుకలకు ఇండియన్ అమెరికన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో సుమారు వెయ్యి టెంపుల్స్ ఉన్నాయని.. దాదాపు అన్ని టెంపుల్స్ లోనూ సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) అమెరికా విభాగానికి చెందిన అమితాబ్ మిట్టల్ వెల్లడించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియా, శాన్ ఫ్రాన్సిస్కో, తదితర 20 సిటీల్లో కార్ ర్యాలీలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. షికాగో, లాస్ ఏంజిలిస్ వంటి సిటీల్లో శ్రీరాముడి ఫొటోలతో భారీ బిల్ బోర్డులు పెట్టినట్లు చెప్పారు.

హ్యూస్టన్‌‌లో 100 టెస్లా కార్లతో  లైట్ షో

శుక్రవారం టెక్సస్‌‌లోని హ్యూస్టన్ సిటీలో ఉన్న గురువాయూరప్పన్ కృష్ణ టెంపుల్ లో 100 టెస్లా కార్లతో మ్యూజికల్  లైట్ షో నిర్వహించారు. ఇంగ్లీష్ లో  'రామ్' అనే పేరును కార్లతో  ఓ ప్యాట్రన్ లో  పార్క్ చేశారు. హెడ్‌‌లైట్‌‌లను ఒకే సమయంలో ఆన్, ఆఫ్ చేస్తూ  లైట్ షో జరిపారు. కార్లలోని మ్యూజిక్ సిస్టమ్ తో  రాముడి పాటలను ప్లే చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ షో  ఆలయ చుట్టుపక్కలున్న వందలాది మంది రామభక్తులను, బాటసారులను ఆకర్షించింది. విశ్వ హిందూ పరిషత్ నేత అచలేశ్ అమర్ మాట్లాడుతూ.. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన సందర్భంగా 100 టెస్లా కార్లతో  లైట్ షో ఈవెంట్ నిర్వహించినట్లు చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా కార్ల నంబర్‌‌లను ముందుగానే రిజిస్టర్ చేశామని తెలిపారు. 100 మంది డ్రైవర్లకు అయోధ్య ఆలయంతో కూడిన -ప్రింటెడ్ టీ-షర్ట్‌‌తో పాటు వారి కారుకు మాగ్నెటిక్ డెకాల్ ఇచ్చామని వివరించారు.