ఎస్వీబీసీ ఛానల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం లైవ్

ఎస్వీబీసీ ఛానల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం లైవ్

అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉదయం 11 : 30 గంటల నుంచి మధ్యాహ్నాం 12: 30 గంటల వరకు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని  టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. తమిళ, కన్నడ, హిందీ  ఛాన‌ళ్లలో ప్రత్యక్షప్రసారం చేయనుంది.  అంతేకాకుండా  ఎస్వీబీసీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయోధ్యలో  జరిగే అన్ని కార్యక్రమాలను లైవ్లో వీక్షించేలా ఏర్పాట్లు చేసింది. జనవరి 22 సోమవారం మధ్యాహ్నాం 12 గంటల నుంచి లైవ్ ప్రారంభం కానుంది.  

అయోధ్య ఆలయంలో రామయ్య కొలువుదీరే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే గర్భగుడిలోకి చేరిన రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహానికి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. సంప్రదాయబద్ధంగా వారం రోజుల ముందు నుంచే ఒక్కో క్రతువు పూర్తి చేసుకుంటూ వస్తున్న వేద పండితులు చివరి ఘట్టాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో అయోధ్య నగరమంతా రామమయం అయిపోయింది. సిటీ అంతటా ఎటు చూసినా శ్రీరాముడు, సీత, హనుమంతుడు, రామాయణ దృశ్యాలు, శ్లోకాలు, జైశ్రీరామ్ నినాదాలతో పోస్టర్లు వెలిశాయి. 

తూర్పున ఎంట్రీ.. దక్షిణాన ఎగ్జిట్

శ్రీరాముడి ఆలయం మూడంతస్తులతో నిర్మాణం కానుంది. మొదటి విడతలో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తి కాగా, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ నిర్మాణ పనులను మిగతా విడతల్లో పూర్తి చేస్తామని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు. భక్తులు రామాలయం లోకి తూర్పు దిక్కు నుంచి ప్రవేశించి, దక్షిణ దిక్కు నుంచి బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. సంప్రదాయబద్ధమైన నాగర్​ శైలిలో 392 పిల్లర్లు, 44 గేట్లతో నిర్మించినట్లు తెలిపారు. రాముడి గుడిని వెయ్యేండ్లకుపైగా నిలిచిపోయేలా ఐరన్, స్టీల్ వాడకుండా నిర్మిస్తున్నట్లు గుడి నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.