ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ నిందితులను ఎవరూ కలవవద్దని కండీషన్​

ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ నిందితులను ఎవరూ కలవవద్దని కండీషన్​
  • ఐదు రోజుల కస్టడీ ఇచ్చిన మంథని కోర్టు

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగాల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణపై అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించిన మాజీ సబ్‌‌‌‌ కాంట్రాక్టర్లు గోపగోని మోహన్‌‌‌‌గౌడ్‌‌‌‌, గుండు రాజు, దళారులు చెలుకలపల్లి సతీశ్‌‌‌‌, బొమ్మగాని తిరుపతిగౌడ్‌‌‌‌ను విచారణ కోసం సోమవారం పోలీస్‌‌‌‌ కస్టడీకి తీసుకున్నారు. ఉద్యోగం కోసం తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వడం లేదంటూ ఇటీవల కమాన్‌‌‌‌పూర్‌‌‌‌ ఏరియాలోని ఓ బావిలో దూకి ముంజ హరీశ్​అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనను సీరియస్‌‌‌‌గా తీసుకున్న పోలీసులు పై నలుగురిపై కమాన్‌‌‌‌పూర్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌తో పాటు పెద్దపల్లి, గోదావరిఖని వన్‌‌‌‌టౌన్‌‌‌‌, ఎన్టీపీసీ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లలో తొమ్మిది కేసులు నమోదు చేశారు. కాగా, కరీంనగర్‌‌‌‌ జైలులో ఉన్న నలుగురిని విచారణ కోసం ఏడు రోజుల పాటు పోలీస్‌‌‌‌ కస్టడీకి ఇవ్వాలని కమాన్‌‌‌‌పూర్‌‌‌‌ ఎస్‌‌‌‌ఐ మస్తాన్‌‌‌‌ మంథని కోర్టులో పిటిషన్ వేశారు. వారిని ఎవరూ కలవవద్దని కండీషన్‌‌‌‌ పెడుతూ ఐదు రోజులు మాత్రమే పోలీస్‌‌‌‌ కస్టడీకి అనుమతి ఇస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు. మంగళవారం రామగుండం హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో సీపీ గానీ, డీసీపీ గానీ నిందితులను విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, లీడర్లు, ఫ్యాక్టరీకి చెందిన కొందరు ఆఫీసర్లలో గుబులు మొదలైంది.