- రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా
గోదావరిఖని, వెలుగు: పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) పనిచేస్తుందని రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ఝా అన్నారు. ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్' పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సైబర్ భద్రత ప్రచార కార్యక్రమ వాల్‌పోస్టర్లను మంగళవారం కమిషనరేట్‌లో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ‘సైబర్ సారధి@1930’, ‘స్కామ్సే బచావ్’, ‘పైసా పైలం’, ‘హర్ స్క్రీన్సురక్షిత్’, ‘మేరా లాగిన్ మేరా రూల్’, ‘మహిళా రక్షణ–-పిల్లల సంరక్షణ–1930 హెల్ప్‌లైన్’, ‘గోల్డెన్ అవర్రిపోర్టింగ్–ప్రాముఖ్యత’ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సైబర్ మోసాల నివారణకు వెంటనే ఫిర్యాదు చేయడం, అవగాహనతో వ్యవహరించడం అత్యంత కీలకమని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
సైబర్క్లబ్స్ను ఏర్పాటు చేయాలని, ఇందులో ప్రతి కాలేజీ నుంచి ఒక టీచర్, ఐదుగురు స్టూడెంట్లు ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రమేశ్, సీసీపీఎస్ ఏసీపీ రంగారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సీఐ శ్రీనివాస్, సీసీపీఎస్ సీఐ కృష్ణమూర్తి, పాల్గొన్నారు.
