
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని రామగుండం ఎరువుల అండ్ కెమికల్స్ లిమిటెడ్ యూనిట్‌లో నీమ్-కోటెడ్ యూరియా ప్రొడక్షన్ భారీ పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్ సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2024–-25లో 94.13 శాతం సామర్థ్య వినియోగం నమోదైందని తెలిపారు. ప్రస్తుతం కీలక పరికరం మరమ్మతుల కారణంగా 92 శాతం సామర్థ్యంతో మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నదని, త్వరలో పూర్తిస్థాయిలో యూనిట్ పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అవసరానికి మించి సరఫరా చేశాం
తెలంగాణలో యూరియా కొరత లేదని, ప్రస్తుత ఖరీఫ్ సీజన్(2025)లో అవసరానికి మించిన సరఫరా జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం లోక్ సభలో ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘తెలంగాణలో యూరియా కొరత లేదు. 2025 ఖరీఫ్‌కు అవసరమైన 20.20 లక్షల టన్నులకంటే ఎక్కువ సరఫరా చేశాం. 22.15 లక్షల టన్నులు యూరియా అందుబాటులో ఉంది. అయితే, అమ్మకాలు మాత్రం 20.08 లక్షల టన్నులుగా నమోదయ్యాయి’ అని తెలిపారు.