రామగుండం ఎరువు మరింత ఆలస్యం

రామగుండం ఎరువు మరింత ఆలస్యం
  • ట్రయల్‌‌ రన్‌‌లో సాంకేతిక సమస్యలు

గోదావరిఖని, వెలుగు: రామగుండం కెమికల్స్‌‌ అండ్‌‌ ఫెర్టిలైజర్స్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌) ఫ్యాక్టరీలో ఉత్పత్తయ్యే యూరియా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌‌,  కర్ణాటక, తమిళనాడు రైతులకు అందడానికి ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ట్రయల్‌‌ రన్‌‌లో టెక్నికల్​ సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్నారు. ఈ పనులు సక్రమంగా జరిగితే వచ్చే మార్చి మొదటి వారంలో మరోసారి ట్రయల్‌‌ రన్‌‌ నిర్వహించి అంతా చక్కదిద్దుకున్నాక వచ్చే దసరా నుంచి యూరియాను బయటకు రిలీజ్‌‌ చేసే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తున్నది.

కాలిన మోటర్‌‌, పైపులైన్లు

ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ఫ్యాక్టరీలో ఎరువును ఉత్పత్తి చేసేందుకు అవసరమైన పనులన్నీ పూర్తయ్యాయి. ఈ క్రమంలో యాజమాన్యం గత జనవరి మొదటి వారంలో ట్రయల్‌‌ రన్‌‌ నిర్వహించింది. అయితే కూలింగ్‌‌ టవర్‌‌లోని మోటర్‌‌ పాక్షికంగా కాలిపోగా, పైపులైన్లు ధ్వంసమయ్యాయి. దీంతో యాజమాన్యం వీటికి రిపేర్లు చేపట్టింది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసే యంత్రాలను దేశీయంగా తయారు చేయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందనే వాదనలు వస్తున్నాయి. దీనికితోడు కోవిడ్‌‌ 19 వల్ల ఇటలీ, డెన్మార్క్‌‌  దేశాలకు చెందిన టెక్నీషియన్లు వారి దేశాలకు వెళ్లిపోయారు. తాజాగా ఆన్‌‌లైన్‌‌ ద్వారా టెక్నీషియన్లు చెప్పిన విధంగా యంత్రాలను బిగించకపోవడం, వాటిని ప్రారంభించకపోవడం వల్లనే మోటర్‌‌, పైపులైన్లు ఫెయిలయ్యాయని చెబుతున్నారు.  అయినా రిపేర్లు ఈ నెలాఖరులోగా పూర్తి చేసి అన్నీ సజావుగా సాగితే వచ్చే మార్చి మొదటి వారంలో తిరిగి ట్రయల్‌‌ రన్‌‌ నిర్వహించవచ్చని తెలుస్తున్నది.

దక్షిణాదిన ఎరువుల కొరత తీర్చేందుకు..

దక్షిణ భారత దేశంలో ఎరువుల కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మూసివేసిన ఎరువుల ఫ్యాక్టరీలను తిరిగి పునరుద్ధరించాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే గతంలో బొగ్గు ఆధారంగా యూరియాను ఉత్పత్తి చేసిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రివైవల్‌‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2015 మార్చి 11న ప్రజాభిప్రాయ సేకరణ జరిపి సెప్టెంబర్ 25న  ‘జీరో డేట్’తో  నిర్మాణ పనులు ప్రారంభించారు. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర  మోడీ ఈ ప్లాంట్ కోసం మెదక్ జిల్లా గజ్వేల్ లో శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబర్ నాటికి ప్లాంట్ పనులు పూర్తి చేసి ఎరువులు ఉత్పత్తి  చేయాలనుకున్నప్పటికీ  వర్షాలు, పలు కారణాల వల్ల పనులు ఆలస్యమయ్యాయి. అనంతరం కరోనా వైరస్‌‌ వ్యాప్తితో ప్లాంట్‌‌లో యూరియా ఉత్పత్తికి బ్రేక్‌ పడింది. ఈ ప్లాంట్‌‌లో ఏటా 13 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవనుండగా, అందులో 6.50  టన్నుల యూరియా ఒక్క తెలంగాణకే  కేటాయించనున్నారు. మిగిలిన 6.50  టన్నుల యూరియాను ఆంధ్రప్రదేశ్‌‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల అవసరాల కోసం వినియోగించనున్నారు.

తండ్రీకొడుకుల కృషి..

రామగుండంలో 1999లో మూసివేసిన ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు కాకా వెంకటస్వామి, ఆయన కుమారుడు జి.వివేక్‌‌ ఎనలేని కృషి చేశారు. ఎరువుల కర్మాగారం ప్రారంభమైతే తెలంగాణకు యూరియా కొరత తీరుతుందని మొదటి నుంచి వీరు భావించి అందుకనుగుణంగా పనిచేశారు. 2004లో పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన తర్వాత  జి.వెంకటస్వామి ఎరువుల ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్‌‌ సింగ్‌‌ను నేరుగా కలిసి మాట్లాడారు. దీంతో ఫ్యాక్టరీని తెరిపించాలని కేంద్ర క్యాబినెట్‌‌లో నిర్ణయం తీసుకున్నారు. కాకా తర్వాత ఆ బాధ్యతను ఆయన కుమారుడు వివేక్‌‌ భుజానికెత్తుకున్నారు. బీఐఎఫ్‌‌ఆర్‌‌ (ఖాయిలా పడిన పరిశ్రమల జాబితా)లోకి వెళ్లిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఆ జాబితా నుంచి తొలగించేందుకు విశేష కృషి చేశారు. నాటి ప్రధాని మన్మోహన్‌‌ సింగ్‌‌తో మాట్లాడి ఫ్యాక్టరీ రూ.10 వేల కోట్ల బకాయిలను మాఫీ చేసే విధంగా ఒప్పించారు. దీంతో ఫ్యాక్టరీని రివైవల్‌‌ చేయాలని 2011 ఆగస్టు 4న కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌లో ట్రయల్‌‌ రన్‌‌ సక్సెస్‌‌ చేసేందుకు యాజమాన్యం ప్రత్యామ్నాయంగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నది. కాకినాడలోని మల్లవరం నుంచి 365 కిలోమీటర్ల దూరంలో గల ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ఫ్యాక్టరీకి గ్యాస్‌‌ను సరఫరా చేసేందుకు పైపులైన్ల నిర్మాణం పూర్తయినా ఇంకా వాటి ద్వారా గ్యాస్‌‌ను అందించలేకపోతున్నది. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారానే గ్యాస్‌‌ను తీసుకువచ్చి ప్రయోగం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జస్ట్​ 20 రోజుల్లో 16 వేల కేసులపై తీర్పులు

క్షణాల్లో కరోనా రిజల్ట్‌‌‌‌‌‌‌‌.. వాసనతో పట్టేస్తున్న ఆర్మీ డాగ్స్

ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది

V6 వెలుగు’ కథనాన్ని పిల్ గా తీసుకోండి

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు..?