జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఆవరణలో మరో 2,400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ పనులు త్వరలో ప్రారంభిస్తామని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ చందన్ కుమర్ సమాంత తెలిపారు. శుక్రవారం రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ 48వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎన్టీపీసీ జెండాను ఈడీ ఆవిష్కరించి, కేక్ కట్ చేసి, బెలూన్లను వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు నిబద్ధతతో పని చేయడం వల్ల ఎన్టీపీసీ అంచెలంచెలుగా ఎదుగుతోందన్నారు. ఉత్పత్తితో పాటు సామాజిక బాధ్యత కింద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ సిస్టమ్స్, స్మార్ట్ గ్రిడ్లపై మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తామని చెప్పారు.
సంక్షేమ కార్యక్రమాల అమలులో రామగుండం యూనిట్ ముందంజలో ఉందని చెప్పారు. దేశానికి స్థిరమైన విద్యుత్ సరఫరా, పర్యావరణ పరిరక్షణకు సంస్థ కట్టుబడి ఉందన్నారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ క్విజ్ విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్రీయ కర్మయోగి జనసేవా లార్జ్ స్కేల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో విశేష సేవలందించిన లీడ్, మాస్టర్ ట్రైనర్లను సత్కరించారు.
