
ములుగు, వెలుగు: దేవాదుల ఎత్తిపోతల పథకంలో కీలకమైన సమ్మక్క బ్యారేజ్ రెడీ అయింది. కానీ కాల్వలు, టన్నెల్ పనులు పూర్తికాకపోవడంతో సర్కారు కేవలం చెరువులు నింపేందుకే పరిమితం కానుంది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు, 37 మండలాల్లోని 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యం ఈసారి కూడా నెరవేరే అవకాశం లేదు. 60 టీఎంసీల గోదావరి నీళ్లను మళ్లించే లక్ష్యంతో ప్రాజెక్టు చేపట్టగా ఈ ఏడాది 10 టీఎంసీలు ఎత్తిపోసేందుకే ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. దేవాదుల మూడో దశలో మూడో ప్యాకేజీ నుంచి 8వ ప్యాకేజీ వరకు చేపట్టిన పనులు పూర్తి కాకపోవడం ఈ స్కీంకు గుదిబండగా మారింది. దీంతో ఆయకట్టు రైతుల్లో మరోసారి నిరాశ నెలకొంది.
రూ.3,516 కోట్లతో..
దేవాదుల స్కీం 2004లో ప్రారంభం కాగా 2006లో పనులు మొదలయ్యాయి. 2008 నుంచి వాటర్ పంపింగ్ స్టార్ట్ చేశారు. అయితే గోదావరి నుంచి 172 రోజుల పాటు నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యం కావడం లేదని, తుపాకుల గూడెం వద్ద బ్యారేజీ నిర్మిస్తే వాటర్ వెనక్కి వచ్చి ఏడాది పొడవునా నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందని చెబుతూ ప్రభుత్వం 2017లో రూ.2,120 కోట్లతో సమ్మక్క బ్యారేజీ పనులు స్టార్ట్ చేసింది. గడువులోగా పనులు పూర్తికాకపోవడం, ధరలు పెరిగాయంటూ మరో రూ.1,396 కోట్ల అంచనా వ్యయాన్ని పెంచారు. మొత్తంగా రూ.3,516 కోట్లతో ఐదేళ్లలో బ్యారేజీ పనులు పూర్తి చేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెంలోని గోదావరి నదిపై తెలంగాణకు అవతలి వైపున ఉన్న చత్తీస్‌గఢ్ బార్డర్‌లోని గుట్టవరకు 60 పిల్లర్లు, 59 రేడియల్గేట్లు, గ్రౌండ్లెవల్నుంచి టాప్లెవల్వరకు 83 మీటర్ల ఎత్తు, 1,132 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు రోడ్డుతో బ్యారేజీ నిర్మాణం జరిగింది. 6.94 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. గేట్ల ఎత్తడానికి కావాల్సిన రోప్ అటాచ్మెంట్ వర్క్స్ కూడా పూర్తి చేశారు. వీటితోపాటు ప్రాజెక్టుకు ఇరువైపులా అప్ స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ క్లియరెన్స్వర్క్స్, స్టోన్ఫిచ్చింగ్తదితర మైనర్ వర్క్స్ అన్నీ పూర్తయ్యాయి. ప్రాజెక్టు పక్కన 240 మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి కోసం సమ్మక్క హైడ్రో ఎలక్ట్రిక్ప్రాజెక్టు నిర్మించారు.
రామప్ప వరకే పనులు కంప్లీట్
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గోదావరి ఇన్‌టేక్ వెల్ నుంచి ధర్మసాగర్, తపాస్‌పల్లి వరకు పైప్‌లైన్లు నిర్మించారు. నీటి ఎత్తిపోతలు మొదలై 14 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు పూర్తి ఆయకట్టుకు నీళ్లందించలేదు. అధికారిక లెక్కల ప్రకారం ఏటా 10 టీఎంసీల వరకే నీళ్లను ఎత్తిపోసి లక్ష ఎకరాలలోపు ఆయకట్టుకు నీరందిస్తున్నారు. 9 రిజర్వాయర్ల కింద ఉన్న సుమారు 350 చెరువుల్లో గోదావరి నీళ్లు నింపుతున్నారు. దేవాదుల ప్రాజెక్ట్ కింద మొత్తం 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల ఎకరాల వరకు ఆయకట్టుకు మెయిన్, పిల్ల కాల్వలు తీసి పెట్టారు. ఇటీవల రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ ప్యాకేజీ 45, 46 కింద సాగు నీటిని విడుదల చేశారు. అయితే ఈ మొత్తం ఆయకట్టుకు నీళ్లందించాలంటే 20 టీఎంసీలకు పైగా పంపింగ్ చేయాలి. కానీ మొదటి దశలో 5, రెండో దశలో 7 టీఎంసీల నీటిని మాత్రమే పంపింగ్ చేసే పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. మూడో దశలో చేపట్టిన పనులలో ఇన్‌టేక్ వెల్ నుంచి రామప్ప వరకు మాత్రమే మూడు వరసల పైప్‌లైన్ పనులు చేశారు. దాంతో గోదావరి నీళ్లు రామప్ప వరకు వచ్చి ఆగిపోతున్నాయి.
12 ఏండ్లుగా సాగుతున్న సొరంగం పనులు
రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు రూ.1,410 కోట్లతో చేపట్టిన సొరంగ నిర్మాణ పనులు 12 ఏళ్లు దాటినా ఇంకా పూర్తి కాలేదు. ఈ పనులు పూర్తయితే ఏడాదిలో 40 టీఎంసీలకు పైగా గోదావరి నీళ్లను ఉపయోగించుకునే వీలుంటుంది. తద్వారా సిద్దిపేట జిల్లా వరకు నీళ్లను లిఫ్ట్ చేయవచ్చు. ఈ స్కీం కింద జనగామ జిల్లాలో 3,04,210 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 99,007, సిద్దిపేట జిల్లాలో 91,844, వరంగల్ జిల్లాలో 77,285 ఎకరాల ఆయకట్టు ఉంది. యాదాద్రి, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కలిపి 48 వేల ఎకరాలు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సిద్దిపేట జిల్లా వరకు నీళ్లిందించవచ్చు.
రెండు నెలల్లో సొరంగం కంప్లీట్ చేస్తం
దేవాదుల మూడో దశ, మూడో ప్యాకేజీలో రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు చేపట్టిన సొరంగ నిర్మాణ పనులు మరో 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం. ఈ పనులు పూర్తయితే 40 టీఎంసీలకు పైగా నీళ్లను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. 2022 వానాకాలంలో దేవాదుల ప్రాజెక్ట్ కింద సాగు నీరందించే ఆయకట్టు వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం.
‒ శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్, నీటి పారుదల శాఖ, వరంగల్