
ఇది రామాయణ్ సర్క్యూట్‌లోని మొదటి ట్రైన్. ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ రైల్వే స్టేషన్ నుంచి ఆదివారం బయలుదేరిన ఈ లగ్జరీ రైలు 17 రోజుల్లో దేశం మొత్తాన్ని చుట్టిరానుంది. రాముడి జీవితానికి సంబంధించిన ప్రదేశాల మీదుగా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ఈ రైలులో రామాయణానికి సంబంధించిన విశేషాలన్నీ ప్రదర్శిస్తున్నారు. శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో మొదటి హాల్ట్ తీసుకుంటుంది. అక్కడి రాముని, హనుమంతుని ఆలయాలతోపాటు నందిగ్రామ్‌లోని భారత్ మందిరాన్ని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత బీహార్‌లోని సీతామర్హిలోని సీతమ్మ జన్మస్థలం, జనక్‌పూరిలోని రామ్-జానకీ ఆలయానికి వెళ్లొచ్చు. అక్కడి నుంచి రైలు వారణాసి చేరుతుంది. పర్యాటకులకు రోడ్డు మార్గంలో వారణాసి, ప్రయాగ, శృంగవర్పూర్, చిత్రకూట్ దేవాలయాలను సందర్శిస్తారు. ఆ తర్వాత నాసిక్‌కు బయలుదేరుతుంది. ఇక్కడ త్రయంబకేశ్వరాలయం.. పంచవటి చూపిస్తారు. అనంతరం కిష్కింధ నగరం హంపి.. చివరగా రామేశ్వరం తీసుకెళ్తారు. 17వ రోజున ఢిల్లీకి తిరిగి చేరుకుంటారు. ‘దేఖో అప్నా దేశ్’లో భాగంగా చేపట్టిన ఈ యాత్ర కోసం ఒక్కో వ్యక్తికి సెకండ్ ఏసీకి రూ.82.950, ఫస్ట్ ఏసీకి రూ.1,02,095 ధర నిర్ణయించారు. రైలు మొత్తం ఏసీనే. స్టార్ హోటల్ స్థాయిలో వసతులు కల్పించారు. ఏసీ బస్సులు, వాహనాల్లోనే భక్తులను తీసుకెళతారు. యాత్ర సందర్భంగా శాఖాహార భోజనమే అందించనున్నారు.