- మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టులిచ్చినా పట్టించుకోరా?: ఎన్.రాంచందర్ రావు
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ స్టేట్ చీఫ్ బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: గోదావరి బేసిన్‌లోని నీటి ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి చాలా కాలం గడిచినా, గోదావరి జలాల వినియోగంపై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు దెబ్బతిన్నాయని, అయితే వాటిని పునరుద్ధరించడంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) 2023 నుంచి 2025 ఏప్రిల్ వరకు వరుసగా నివేదికలిచ్చినా, అవసరమైన భూగర్భ పరీక్షలను పూర్తి చేయలేదని ఆరోపించారు.
దీంతో దాదాపు 200 టీఎంసీల గోదావరి నీటిని కోల్పోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదని ఆయన మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్ట్‌కు కేంద్రం నుంచి హైడ్రాలజీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ వచ్చినా పనులు పూర్తి చేయడం లేదన్నారు.
సమ్మక్క సారక్క ప్రాజెక్ట్‌కు 47 టీఎంసీలకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చినా, ప్రాజెక్టు కమాండ్ ఏరియాను గుర్తించడంలో విఫలమైందని మండిపడ్డారు. గోదావరి, -కావేరి నదుల అనుసంధానంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులు తెలంగాణ ప్రయోజనాలకు ఇబ్బందికరంగా మారుతాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కనపెట్టి, గోదావరి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
