ఇండియాలోనే చెత్త సర్వీస్.. ఇండిగోపై రానా ఫైర్

ఇండియాలోనే చెత్త సర్వీస్.. ఇండిగోపై రానా ఫైర్

ఇండిగో ఎయిర్ లైన్స్ సేవలపై హీరో దగ్గుబాటి రానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియాలోనే చెత్త సర్వీస్ అంటూ ఇండిగో సర్వీస్ పై మండిపడ్డారు. తన లగేజ్ మిస్ అవడం పై ఇండిగో పై అసహనం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లతో విమర్శలు చేశారు. 

రానా తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. శంషాబాద్  ఎయిర్ పోర్టులో చెక్ ఇన్ అయ్యాక విమానం ఆలస్యమంటూ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో మరో విమానంలో రానా, ఆయన కుటుంబ సభ్యులు బెంగళూరుకు చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వారి లగేజ్ రాలేదు. లగేజ్ ఏదని అడిగితే.. ఇండిగో సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రానా ఇండిగో ఎయిర్ లైన్స్ పై వరుస ట్వీట్లతో విమర్శలు చేశారు. 

ఇప్పటివరకు ఇండిగో అంత చెత్త విమాన ప్రయాణం తాను చేయలేదని రానా ట్వీట్ చేశారు. విమాన సమయాల గురించి ఎవరికీ తెలియదన్నారు. కనిపించకుండా పోయిన లగేజ్ గురించి పట్టించుకోరని ఇండిగో సిబ్బంది పై అసహనం వ్యక్తం చేస్తూ రానా వరుస ట్వీట్లు చేశారు. 

అక్కడితో ఆగకుండా మరో సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘మా ఇంజినీర్లు రోజూ, నిరంతరాయంగా సురక్షితమైన, అవాంతరాలు లేని విమానాలను అందిస్తున్నారు’ అని ఇండిగో చేసిన ట్వీట్‌ను రానా రీట్వీట్ చేశారు. ఇంజినీర్లు బాగుండొచ్చు కాని సిబ్బందికి మాత్రం ఏం తెలియదు అని రానా ట్వీట్ చేశారు.