యాదగిరిగుట్ట పట్టణానికి పూర్వ వైభవం తెస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదగిరిగుట్ట పట్టణానికి పూర్వ వైభవం తెస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతోనే యాదగిరిగుట్ట సిటీ ఆగమైంది
  • ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే యాదగిరిగుట్ట పట్టణం ఆగమైందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. హైలెవల్ బ్రిడ్జ్ ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణలో కేసీఆర్ స్థానిక ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకోకుండా ఏర్పాటు చేసిన బ్రిడ్జి వల్లే యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధికి దూరమై స్థానిక చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు.

తాను ఎంపీగా ఉన్న సమయంలో బ్రిడ్జి ఏర్పాటును వ్యతిరేకించానని, అయినా కేసీఆర్ వినకుండా నిర్మాణం చేసి స్థానికుల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా బ్రిడ్జి  నిర్మాణం కోసం ఇండ్లు, షాపులు కోల్పోయిన బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బ్రిడ్జిని తొలగించి యాదగిరిగుట్ట పట్టణానికి పూర్వ వైభవం తెస్తామని స్పష్టం చేశారు.  నిర్వాసితులకు ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ప్లాట్లు, షాపులను మంజూరు చేయాలని స్థానిక వర్తక సంఘం నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్‌‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ కు మంత్రి కోమటిరెడ్డి ఫోన్ చేసి వెంటనే బ్రిడ్జి తొలగింపునకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యా మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, వర్తక సంఘం నాయకుడు ముడుంబై గిరిధర్, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, సైదాపురం మాజీ సర్పంచ్ బీర్ల శంకర్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు బిక్షపతి, మాజీ కౌన్సిలర్లు వాణీ భరత్ గౌడ్, మల్లేష్ యాదవ్, అరుణ ఉన్నారు.