పేలిన ట్రాన్స్​ఫార్మర్..ఊళ్లో టీవీలు, ఫ్రిజ్​లు బుగ్గి

పేలిన ట్రాన్స్​ఫార్మర్..ఊళ్లో టీవీలు, ఫ్రిజ్​లు బుగ్గి
  •  
  • రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ఘటన
  • విద్యుత్ శాఖ అధికారులపై గ్రామస్తుల ఫైర్

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఊళ్లో ఉన్న వాళ్ల ఇండ్లల్లోని ఎలక్ట్రిక్ సామాన్లు అన్నీ కాలిపోయాయి. ట్రాన్స్​ఫార్మర్ బ్లాస్ట్​కావడమే దీనికి కారణమని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం లస్కర్​గూడ గ్రామస్తులు చెప్పారు. కొన్ని రోజులుగా ట్రాన్స్​ఫార్మర్​లో సమస్య ఉండటంతో కరెంట్ సప్లై సరిగ్గా కావడం లేదు. వెంటనే ట్రాన్స్​ఫార్మర్ రిపేర్ చేయాలని లోకల్ లీడర్లు, సంబంధిత లైన్​మెన్​తో పాటు ఏఈకి గ్రామస్తులు విన్నవించారు. వాట్సాప్ లో కూడా చాలా సార్లు రిక్వెస్ట్​ చేశారు. అయినా, విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదు. శనివారం రాత్రి 11 గంటల టైంలో ట్రాన్స్​ఫార్మర్ బ్లాస్ట్​ అయ్యింది. 

దీంతో అందరి ఇండ్లల్లో ఉన్న టీవీలు, ఫ్రిడ్జ్​లు, ఏసీలు, వాటర్ మోటార్లు, ఫ్యాన్లు, కూ‌‌‌‌‌‌‌‌లర్లు కాలిపోయాయి. సిద్దగౌని మంజుల అనే మహిళా తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెను గ్రామస్తులు అబ్దుల్లాపూర్​మెట్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంట్లోని అన్ని ఎలక్ట్రిక్ సామాన్లు కాలిపోయాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంపీటీసీ సాయికుమార్ గౌడ్, జడ్పీటీసీ బింగి దాసు ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముందు బైఠాయించి ఆదివారం నిరసన తెలిపారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించిందని గ్రామస్తులు విమర్శించారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. ట్రాన్స్​ఫార్మర్ మార్చాలని ఈనెల 11వ తేదీన వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ధర్నాలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గ్రామస్తులు లింగం శ్రీకాంత్, ప్రసాద్, తదితరుల పాల్గొన్నారు.