- కొనసాగుతున్న 7వ విడత గణన
- మరికొద్ది రోజుల్లోనే పూర్తి కానున్న మైనర్ ఇరిగేషన్ సర్వే
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో బోర్లు, బావులు, చెరువులు, చెక్ డ్యామ్లు, పాం పాండ్ల లెక్క తేలనున్నది. చిన్ననీటి వనరుల సమగ్ర సమాచారంతో పాటు వాటి అభివృద్ధికి ప్రణాళిక రూపొంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదేండ్లకోసారి నిర్వహించే మైనర్ ఇరిగేషన్ ఏడో విడత గణన ముమ్మరంగా కొనసాగుతున్నది. ముఖ్యప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల వనరుల శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ గణన నవంబర్ 14న మొదలు కాగా.. 20 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
తహసీల్దార్, ఎంపీడీవో, ఇరిగేషన్ ఏఈలు సూపర్ వైజర్లుగా, జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఈవోలు ఎన్యూమరేటర్లుగా నిర్వహిస్తున్న ఈ సర్వేలో వాటర్ బాడీస్తో పాటు బోర్ల కింద సాగవుతున్న పంట విస్తీర్ణం, చెరువుల కింద ఆయకట్టు వివరాలు కూడా నమోదు చేస్తున్నారు.
ప్రతి లెక్క మొబైల్ యాప్లో నమోదు
మైనర్ ఇరిగేషన్ గణనలో 240 మంది జీపీవోలు, 49 మంది సెక్రటరీలు, 27 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 87 మంది ఎఫ్ ఏలు, 10 మంది ఏఈవోలు, ఏడుగురు వీఆర్ ఏలు పాల్గొంటున్నారు. ఫీల్డ్లెవెల్లో పర్యటిస్తున్న అధికారులు, సిబ్బంది గ్రామాల వారీగా వనరులను గుర్తించి జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఫొటోలు తీసుకొని ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్లో అప్లోడ్చేస్తున్నారు.
బోర్ల లోతు, నీటి లభ్యత, వాటి కింద సాగవుతున్న పంటల విస్తీర్ణం, చెరువులు, లిఫ్టు ద్వారా స్థిరీకరిస్తున్న ఆయకట్టు వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఈ లెక్కల ద్వారా చిన్ననీటి వనరుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసి కేంద్రానికి పంపిస్తారు. దీని ఆధారంగా నిధులు కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.
బోర్లు పెరిగే అవకాశం
ఆరో మైనర్ ఇరిగేషన్ గణన ప్రకారం జిల్లాలోని 599 గ్రామాల్లో 1029 తవ్విన బావులు ఉన్నాయి. బోర్ల విషయానికొస్తే 115 ఫీట్ల లోతు ఉన్నవి 1824, 230 ఫీట్ల లోతు ఉన్నవి 26,766, 230 ఫీట్ల కన్నా లోతు ఉన్న బోర్లు 29,275 ఉన్నాయి. తవ్విన బావులు చాలా వరకు ఎండిపోవడంతో వాటి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. బోర్లు మాత్రం రెట్టింపయ్యే ఛాన్స్ ఉంది.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో రైతులు ఐదేండ్లలో వేల సంఖ్యలో బోర్లు వేశారు. ఐదేండ్ల కింద లెక్కల ప్రకారం.. చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు, పాంపాండ్లు 2,966 ఉన్నాయి. ఇందులో చెరువులు దాదాపు అదే సంఖ్యలో ఉండనుండగా చెక్ డ్యాములు, పాంపాండ్లు పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు 371 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలుండగా.. ఇవి కూడా స్వల్పంగా పెరగనున్నాయి.
