ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం

ఆదిలాబాద్ జిల్లా డీసీసీ  అధ్యక్షుడికి ఘన స్వాగతం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నరేశ్​ జాదవ్ ఆదివారం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మావల జాతీయ రహదారి వద్ద పటాకులు కాల్చి భారీ పూలమాల వేసి స్వాగతం పలికారు. 

అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి రిమ్స్ హాస్పిటల్ ఆవరణలోని అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు, కలెక్టరేట్​ చౌక్​లోని కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తన గురువు, మాజీ మంత్రి రాంచంద్రరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఫొటోకు నివాళులు అర్పించారు.  

ఈ పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ లీడర్లు లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, అభిషేక్, దుర్గం శేఖర్, అశోక్, ప్రవీణ్, నదీం తదితరులున్నారు. 

పార్టీ బలోపేతానికి కలసికట్టుగా పనిచేయాలి

నేరడిగొండ: జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషిచేయాలని ఆదిలాబాద్ జిల్లా కొత్త డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పిలుపునిచ్చారు. డీసీసీ ఎన్నిక తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు నేరడిగొండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య ఘనంగా స్వాగతం పలికారు. సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా నరేశ్ జాదవ్ మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం పనిచేసిన తనను డీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు గాను ఏఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నేతలు ప్రపుల్ చందర్ రెడ్డి, ఎరడ్ల చంద్రశేఖర్, ఆయిటి శ్రీకాంత్, సంజీవ్ పాల్గొన్నారు.