రియల్టర్ల హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

రియల్టర్ల హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
  •  తీర్పునిచ్చిన రంగారెడ్డి జిల్లా కోర్టు

ఎల్​బీనగర్, వెలుగు : గతేడాది మార్చిలో ఇబ్రహీంపట్నంలోని కర్ణంగూడలో జరిగిన రియల్టర్ల జంట హత్యల కేసులో ముగ్గురిని దోషులుగా తేల్చిన రంగారెడ్డి జిల్లా కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది మార్చి 1న కర్ణంగూడ వద్ద కారులో వెళ్తున్న రియల్టర్లు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ రాఘవేందర్ రెడ్డి బీఎన్​రెడ్డిలోని ఓ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు..

రియల్టర్ మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని పటేల్ గూడ సమీపంలో ఉన్న వెంచర్​కు సంబంధించి మట్టారెడ్డితో  శ్రీనివాస్ రెడ్డి,  రాఘవేందర్ రెడ్డికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. భూ వివాదం కారణంగానే మట్టారెడ్డి  తన దగ్గర పనిచేసే ఖాజా మొయినుద్దీన్, భిక్షపతికి సుపారీ ఇచ్చి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిని హత్య చేయించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అదే నెల 3న పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

గురువారం విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టు మట్టారెడ్డి, ఖాజా మొయినుద్దీన్, భిక్షపతిని దోషులుగా తేల్చి వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన అప్పటి ఎల్​బీనగర్ ఏసీపీ  శ్రీధర్ రెడ్డి రాచకొండ సీపీ చౌహాన్ అభినందించారు. శ్రీధర్ రెడ్డిని ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టి
గేషన్ ఆఫీసర్​గా అప్పటి సీపీ నియమించి దర్యాప్తు చేయించారు. రియల్టర్ల జంట హత్యల కేసులో విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్ అధికారి, సిబ్బందిపై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.