- రంగారెడ్డిలో 5 స్థానాలు కైవసం
- మెజారిటీ లేకున్నా అలియాబాద్‌లో పాగా
- ఆమనగల్లో ఒక్క సీటు గెలిచినా పై‘చేయి’
- హంగ్ వచ్చిన మూడు చోట్లా హస్తానిదే హవా
- వికారాబాద్‌లోని నాలుగు చోట్లా చెయ్యే
చేవెళ్ల/షాద్‌నగర్/ఇబ్రహీంపట్నం/వెలుగు : మున్సిపల్ చైర్పర్సన్ఎన్నికల హస్తం హవా నడిచింది. వికారాబాద్ జిల్లాలో నాలుగింటికి నాలుగు స్థానాల్లో పాగా వేసింది. రంగారెడ్డి జిల్లాలో స్పష్టమైన మెజార్టీ సాధించిన చేవెళ్ల, శంకర్ పల్లి, షాద్ నగర్ మున్సిపాలిటీల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ స్థానాలను దక్కించుకుంది. హంగ్ వచ్చిన మొయినాబాద్ మున్సిపాలిటీ, కేవలం ఒకే ఒక్క కౌన్సిలర్ గెలిచిన అమన్‌గల్ మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకుంది. మేడ్చల్‌మల్కాజిగిరిలో జిల్లాలో రెండు స్థానాలను బీఆర్ఎస్ పూర్తి మెజారిటీతో దక్కించుకోగా హంగ్ఏర్పడిన ఆలియాబాద్‌లో చైర్పర్సన్ సీటును కాంగ్రెస్తన ఖాతాలో వేసుకుంది. ఇబ్రహీంపట్నంలో 24 స్థానాలకు బీఆర్ఎస్ 13 స్థానాలు గెలుచుకున్నా ఆ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి కనిపించకుండా పోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.
రంగారెడ్డి జిల్లాలో..
చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌తరఫున16వ వార్డు నుంచి గెలిచిన దేవరి సమతా వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ18 వార్డులుండగా..11 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 3 బీజేపీ విజయం సాధించాయి. స్పష్టమైన మెజారిటీ రావడంతో 15 వ వార్డు నుంచి గెలిచిన సమతా వెంకట్ రెడ్డి చైర్‌పర్సన్‌గా, 13వ వార్డు నుంచి గెలుపొందిన రాములు గౌడ్ వైస్ చైరపర్సన్‌గా ఎన్నికయ్యారు. శంకర్‌పల్లిలో 15 వార్డులుండగా.. 9 కాంగ్రెస్,4 బీఆర్ఎస్, 2 ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున 15వ వార్డు నుంచి గెలిచిన సాత ప్రవీణ్ కుమార్ చైర్‌పర్సన్‌గా, 14 వ వార్డు నుంచి గెలిచిన జూలకంటి శ్వేతా పాండురంగా రెడ్డి వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు.
షాద్‌నగర్‌లో 28 స్థానాలుండగా..15 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, ఒకటి బీజేపీ, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఈ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా 23వ వార్డు నుంచి గెలిచిన అగ్గునూరి బసవేశ్వర్, వైస్ చైర్‌పర్సన్‌గా 14వ వార్డు మెంబర్ అందె మోహన్ ఎన్నికయ్యారు.
ఆమనగల్లో బీఆర్ఎస్ నుంచి 6వ వార్డు అభ్యర్థిగా గెలిచిన నేనావత్ పత్యనాయక్ కాంగ్రెస్‌లో చేరి బీజేపే మద్దతుతో చైర్పర్సన్ అయ్యారు. ఇక్కడ 15 వార్డులుండగా..8 బీఆర్ఎస్, 6 బీజేపీ, 1 స్థానం కాంగ్రెస్ గెలుచుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎక్స్అఫిషియో ఓటు నమోదు చేసుకున్నాడు. కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ పత్య నాయక్, బీఆర్ఎస్ నుంచి పాపిశెట్టి రామకృష్ణ నామినేషన్ వేగయా, పత్య నాయక్‌కు 9 ఓట్లు, రామకృష్ణ కు 7 ఓట్లు వచ్చారు. వైస్ చైర్ పర్సన్ గా బీజేపీ నుంచి గెలిచిన 3వ వార్డు కౌన్సిలర్ తల్లోజు గీత ఎన్నికయ్యారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ..
మేడ్చల్ కలెక్టరేట్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 24 వార్డులుండగా 14 వార్డులు బీఆర్ఎస్, కాంగ్రెస్ 9, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. పూర్తి మెజారిటీ రావడంతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ వార్డు మెంటర్ జాము రవి, వైస్ చైర్‌పర్సన్‌గా మొరుసు బావి శశిరేఖను ఎన్నుకొన్నారు.
ఎల్లంపేటలో 24 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ కు 12, కాంగ్రెస్ కు 8, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్13 కావడంతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఉన్న ఎక్స్- అఫీషియో ఓటు, బీజేపీ సభ్యుల మద్దతుతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్స్థానాలను దక్కించుకుంది. బీఆర్ఎస్ నుంచి 8వ వార్డు మెంబర్ లావుడ్య శ్రీదేవి చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా బీజేపీ19వ వార్డు నుంచి గెలిచిన మేకల రజిత దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
వికారాబాద్‌జిల్లాలో...
కొడంగల్: వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థులే చైర్పర్సన్లు అయ్యారు. కొడంగల్‌లో 12 వార్డులు ఉండగా, 10 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1ఎంఐఎం గెలిచాయి. పూర్తి మెజారిటీ ఉండడంతో చైర్‌పర్సన్‌గా 4వ వార్డు కౌన్సిలర్నందారం ప్రశాంత్, వైస్ చెర్‌పర్సన్‌గా 8వ వార్డు కౌన్సిలర్ శంకర్‌నాయక్ గెలుపొందారు.
పరిగిలో ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పీఠాలను దక్కించుకుంది. వికారాబాద్‌లో కాంగ్రెస్ గెలుపుతో అసెంబ్లీ స్పీకర్ప్రసాద్కుమార్తనయ అనన్య మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు. తాండూరులోనూ కాంగ్రెస్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కుర్చీలను దక్కించుకుంది.
వికారాబాద్: తాండూర్ లో 12వ వార్డు నుంచి గెలిచిన పట్లోళ్ల నీరజ చైర్‌పర్సన్‌గా, 29వ వార్డు నుంచి గెలిచిన అబ్దుల్ రజాక్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
