
తన ఫేస్ బుక్ హ్యాక్ చేశారని.. ఇన్ స్టాగ్రామ్ ను డిలీట్ చేశారని.. ఇది అధికార పార్టీ బీఆర్ఎస్ పనేనని బీజేజీ నాయకురాలు రాణి రుద్రమ దేవి ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం(అక్టోబర్ 31) నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలతో మాట్లాడేందుకు, వారితో తన ఆలోచనలని పంచుకునేందుకు సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడిందని అన్నారు.
12 ఏళ్లుగా తాను ఫేస్ బుక్ వాడుతున్నానని.. కానీ నిన్న(అక్టోబర్ 30) సాయంత్రం తన ఫేస్ బుక్ ని హ్యాక్ చేసి.. ఇన్ స్టాగ్రామ్ ని డిలీట్ చేశారని.. ఇది ప్రభుత్వ పెద్దల పనే అని మండిపడ్డారు. ఐటీ మంత్రి కేటీఆర్ స్వయంగా ఒక టీమ్ ని స్లీపర్ సెల్స్ గా పెట్టి ఇలా చేపిస్తున్నారని ఆరోపించారు. తాను సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్నానని.. అందుకే కేటీఆర్ భయపడి, ఇలాంటి పనులు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
తాను మీడియాతో మాట్లాడుతుండగానే పేస్ బుక్ లో ఎవరో ఫన్నీ వీడియో పోస్ట్ చేశారని చెప్పారు. దీనిపై సైబర్ క్రైమ్ తో పాటు ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేస్తామని తెలిపారు. పోలీసులు అధికార పార్టీ కొమ్ముకాయకుండా ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని రాణి రుద్రమ పేర్కొన్నారు.