బీజేపీ ఓబీసీ మోర్చా నేత హత్యకేసులో.. 15 మందికి ఉరిశిక్ష

బీజేపీ ఓబీసీ మోర్చా నేత హత్యకేసులో.. 15 మందికి ఉరిశిక్ష
  • కేరళ కోర్టు సంచలన తీర్పు
  • దోషులందరూ నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన కార్యకర్తలే

కొట్టాయం:  బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ స్టేట్ సెక్రటరీ రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది పీఎఫ్ఐ కార్యకర్తలకు మరణ శిక్ష విధిస్తూ కేరళలోని అలప్పుజ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 15 మంది దోషులు.. నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని రాజకీయ విభాగమైన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్​డీపీఐ)కి చెందినవారిగాతేల్చింది. మావెలిక్కర అదనపు జిల్లా జడ్జి జస్టిస్ వీజీ శ్రీదేవి మంగళవారం ఈ తీర్పు వెలువరించారు. దేశంలో 2022లోనే పీఎఫ్ఐను బ్యాన్ చేసినట్టు జడ్జి వివరించారు. 45 ఏండ్ల రంజిత్ శ్రీనివాసన్​ను 2021, డిసెంబర్ 19న అతని భార్య, తల్లి, కూతురి ముందే పీఎఫ్ఐ, ఎస్​డీపీఐ కార్యకర్తలు దారుణంగా హత్య చేసినట్టు రుజువైందన్నారు. శ్రీనివాసన్ తల్లి, సోదరిపై కూడా 15 మంది దాడి చేశారని చెప్పారు. నేరాలన్నీ రుజువు కావడంతోనే దోషులందరికీ మరణ శిక్ష విధిస్తున్నట్టు జడ్జి పేర్కొన్నారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

2021, డిసెంబర్ 19న ఆదివారం కావడంతో రంజిత్ ఇంట్లోనే ఉన్నారు. ఉదయం 6.15 గంటల టైమ్​లో భార్య లిశా, తల్లి వినోదిని కిచెన్​లో ఉన్నారు. పెద్ద కూతురు భాగ్య ట్యూషన్​కు వెళ్లింది. అప్పుడే కొంత మంది ఇంట్లో చొరబడి సుత్తి, కత్తులతో దాడి చేశారు. లిశా, వినోదిని వచ్చి ఆపేందుకు ప్రయత్నించగా.. కత్తులతో బెదిరించారు. రంజిత్ ను తీవ్రంగా గాయపర్చడంతోపాటు రెండు కాళ్లను సైతం నరికేశారు. తీవ్రగాయాలపాలై రంజిత్ చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే, అంతకుముందు రోజు డిసెంబర్ 18న అలప్పుజ జిల్లాలో ఆర్ఎస్ఎస్  కార్యకర్తలు ఎస్​డీపీఐ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ ను హత్య చేసినందుకు ప్రతీకారంగా శ్రీనివాసన్ ను హత్య చేసినట్లు దర్యాప్తులో దోషులు వెల్లడించారు.