‘ధురంధర్’ చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకున్నాడు రణవీర్ సింగ్. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 19న ఈ మూవీ సీక్వెల్ రాబోతోంది. ఇదిలా ఉంటే త్వరలో శంకర్ డైరెక్షన్‌లో రణవీర్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. 'వీర యుగ నాయగన్ వేల్పారి' అనే చారిత్రక నవలను సినిమాగా తీయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు శంకర్. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. తమిళనాట గొప్ప దాతృత్వం, ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందిన వేల్పారి రాజు కథ ఇది. అయితే దీన్ని శంకర్.. ఇద్దరు హీరోల కథగా మార్చి విక్రమ్, రణవీర్ సింగ్‌లతో తీయబోతున్నట్టు కోలీవుడ్ సమాచారం.
బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. నిజానికి ఇదే బ్యానర్‌లో రణవీర్ సింగ్ హీరోగా ‘అపరిచితుడు’ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు శంకర్. ఐదేళ్ల క్రితం అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది కానీ పట్టాలెక్కలేదు. ఈ గ్యాప్‌లో ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ చిత్రాలతో బాక్సాఫీస్ రేసులో వెనుకబడ్డ శంకర్.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ని రణవీర్ సింగ్‌తో తీసి తిరిగి ఫామ్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు.
‘ధురంధర్’తో రణవీర్ సింగ్ హ్యూజ్ సక్సెస్‌ను అందుకోవడం ఈ మూవీకి కలిసొచ్చే అంశం. అయితే తమిళ సంస్కృతికి అద్దం పట్టే ‘వేల్పారి’ కథను బాలీవుడ్ హీరోతో పాన్ ఇండియా సినిమాగా తీస్తే నేటివిటీ దెబ్బతింటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మణిరత్నం తీసిన ‘పొన్నియిన్ సెల్వన్’ తెలుగు సహా ఇతర భాషల్లో నిరాశపరిచిన విషయం తెలిసిందే.
