70 ఏండ్లుగా  రెడ్లు, రావులేనా?

70 ఏండ్లుగా  రెడ్లు, రావులేనా?

ఏడు దశాబ్దాలుగా రావులు-రెడ్లు యధేచ్ఛగా దోపిడీ పాలన సాగిస్తూ తమ వర్గాలను పైకి తీసుకువస్తూ.. వాళ్లను మోసే కూలీలుగా బహుజనులు ఇంకెన్నాళ్లు, ఎన్ని తరాలు బతకాలి? బహుజన భావజాల ఉద్యమంతో దొరల పాలన అంతమయ్యే పరిస్థితుల్లో రెడ్లు అధికారంలోకి వచ్చి మరో దోపిడీ పాలన మొదలు కాకముందే బహుజనులు రాజ్యాధికారం సాధించుకోవాలి. దొరలు పోతే పటేళ్లు, పటేల్ పోతే పట్వారీలు అనే పరిస్థితి ఇంకెంతకాలం? బహుజనుల చెమటతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వారి కోసం కాకుండా వానరసైన్యంగా మారి రెడ్లకు పట్టం కట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలి. పి.శివశంకర్, జగన్నాథరావు, మదన్మోహన్, డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, కేకే, రెడ్డయ్య, జి.వెంకటస్వామి లాంటి వారిని అధికారంలోకి రావటానికి వాడుకుని ముఖ్యమంత్రి పదవులను మాత్రం మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకట్రామ్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు.

ఇన్నాళ్లు ఉత్తమ్​ కుమార్​రెడ్డి పీసీసీ చీఫ్​గా ఉండగా ఇప్పుడు ఆ పదవిని మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారా? కేసీఆర్ తెలంగాణను అమితంగా ప్రేమించారని కేటీఆర్​ అంటున్నారు.  1950కి ముందున్న తెలంగాణను ఆయన ప్రేమించారు. అందుకే రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసి దొరల, పటేళ్ల, పట్వారీల అధీనంలోని తెలంగాణ అనే తిరోగమన దిశగా తన పాలన సాగిస్తున్నారు. ఆలె నరేంద్ర, బండారు దత్తాత్రేయ, బంగారు లక్ష్మణ్, డాక్టర్ కె.లక్ష్మణ్ వంటి బహుజనులను పార్టీని మోయడానికి వాడుకుని, అధికార పదవులు మాత్రం వెంకయ్యనాయుడు, విద్యాసాగర్​రావు, కిషన్ రెడ్డి లాంటి పెద్ద కులాల వారికి అప్పగిస్తారా? ఇప్పటికైనా పోరాట యోధులైన జనాలు దొరలు, పటేళ్లు ఏలే పార్టీలను అంతమొందించి బహుజన రాజ్యాధికార నినాదం, అధికారం వైపు అడుగులు వేయాలి.
                                                                                                                                          - ఎర్ర సత్యనారాయణ, అధ్యక్షుడు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం