
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాల్ని సంరక్షించా ల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కాసాని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు లేని బాలిక తన తమ్ముడితో కలిసి జీవిస్తుంటే ఆమెపై చేసిన అఘాయిత్యం మానవత్వానికి మచ్చగా మారిందని తెలిపారు. బాలిక, ఆమె సోదరుడు మనో ధైర్యంతో బతికే విధంగా చూడాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. గంజాయి, డ్రగ్స్ ముఠాలను ప్రభుత్వం అణచివేసి ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలని కాసాని కోరారు.