
ఎర్నాకులం: నటుడు, కేరళలో అధికార కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే ముఖేశ్‌పై రేప్ కేసు నమోదైంది. గతంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్నాకులం జిల్లా మారడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. భారత న్యాయ సంహిత అమలులోకి రాక ముందు నేరం జరిగినందున.. పూర్వ ఐపీసీలోని సెక్షన్ 376(రేప్) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తనపై లైంగిక వేధింపులు జరిగిన సమయంలో తాను సినీ పరిశ్రమకు కొత్త అని.. పలుకుబడి కలిగిన, సీనియర్ నటులు కావడంతో భయంతో అప్పట్లో తాను ఫిర్యాదు చేయలేకపోయినట్టు ఆమె పేర్కొన్నారు.
2008, 2011 మీటూ ఉద్యమం టైమ్‌లో కూడా ముఖేశ్‌పై పలువురు సినీతారలు ఆరోపణలు చేశారు. కేరళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టులోని అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పలువురు నటీమణులు తాము ఎంతగా వేధింపులకు గురైంది వెల్లడించారు. వారిలో కొంత మంది గతంలో తమను వేధించిన వారిపై వరుసగా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. దీంతో కేరళ సినీ ఇండస్ట్రీలోని పలువురిపై ఇప్పటి వరకు 20కి పైగా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన వారిలో జయసూర్య, మునీర్, సిద్దీక్, రంజిత్ బాలకృష్ణన్, మణియన్పిళ్లై రాజు, ఎడవెల బాబు తదితరులు ఉన్నారు.
వరుసగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో మరిన్ని కేసులు నమోదు అయ్యే చాన్స్ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్‌లాల్ మంగళవారం కేరళ ఆర్టిస్టుల సంఘం ‘అమ్మ’ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలోని పలువురు సభ్యులు కూడా తమ పదవుల నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై ఇలాంటి ఒక కమిటీ ఒకటి వేయాలని 100 మందికిపై నటులు, స్క్రీన్ వర్కర్స్ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీని కోరారు.