
తిరువనంతపురం: ఓ పక్క ల్యాండ్ స్లైడ్స్ బీభత్సం..గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి.. ఇక్కడో గ్రామం ఉండేది అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. వందల సంఖ్యలో మరణాలు..అదే స్థాయిలో క్షతగాత్రులు.. ఇదంతా ప్రస్తుతం కేరళలోని వయనాడ్ ప్రాంత పరిస్థితి.. ఇదిలా ఉంటే.. కేరళను మరో ముప్పు పట్టి పీడిస్తోంది. అదే వింత వ్యాధి.. అరుదైన వ్యాధి.. మెదడులో ఇన్ఫెక్షన్.. ఇప్పటికే ఈ వ్యాధితో ఐదుగురు చనిపోయారు. ఇంకా కొంతమంది చికిత్స పొందుతున్నారు. ఏంటీ వింత రోగం..లక్షణాలు, చికిత్స, కేరళ ప్రభుత్వం ఏమంటోందో తెలుసుకుందాం..
2024 జనవరి నుంచి ఆగస్టు వరకు కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధి ప్రజలను పట్టి పీడిస్తోంది. మెదడులో ఇన్ఫెక్షన్ కారణంగా మొత్తం ఐదు మరణాలు నమోదయ్యాయని బుధవారం ఆగస్టు 08, 2024న ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో 15 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని, అందులో తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆమె చెప్పారు. 15 కేసుల్లో ఏడు కేరళ రాజధాని తిరువనంతపురంలో నమోదయ్యాయి. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌కు సంబంధించి దేశంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవని..ఇది చాలా అరుదైన వ్యాధి అని మంత్రి వీణా జార్జ్ చెప్పారు. ఈ వ్యాధి సోకిన రోగుల చికిత్స కోసం కేరళ ప్రత్యేక మార్గదర్శకాలను అభివృద్ధి చేసిందన్నారు.కేంద్రం మొదటల్లో ఈ వ్యాధి నివారణకు మందులు సరఫరా చేసింది. అయినప్పటికీ అవసరమైనంత మందుల సరఫరా లేదని అన్నారు. అయితే ఈ వ్యాధికి మందులు జర్మనీనుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆసుపత్రిలో చేరిన వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య మంత్రి తెలిపారు.
ఈ వ్యాధి అమీబా ద్వారా వ్యాపిస్తుంది. పుర్రెపై శస్త్రచికిత్స చేయించుకున్న లేదా సున్నితమైన నాసికా పొర ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా కలుషితమైన నీటిద్వారా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. లక్షణాలు స్పష్టంగా లేనప్పటికీ తలనొప్పి వచ్చినా ఆరోగ్య శాఖకు తెలియజేయాలని ప్రజలకు ఆరోగ్య శాఖ విజ్ణప్తి చేస్తోంది.