శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం

శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం

శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరుగుతున్న53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో రీస్టోర్‌డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. దీంతో గోవాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. నేషనల్ ఫిల్మ్ అర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మన దేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి ప్రదర్శించనున్నారు. ఇందులో శంకరాభరణం చిత్రానికి చోటు దక్కింది.  

కళాతపస్వీ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని పూర్ణోదయా క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. జె.వి. సోమయాజులు, మంజుభార్గవి, అల్లు రామలింగయ్య ముఖ్యపాత్రలు పోషించారు. కె. వి. మహదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 1980లో విడుదలైన ఈ చిత్రం.. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి సంచలనం సృష్టించింది. గోవాలో ఈ చిత్ర ప్రదర్శనకు ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.