కన్నడ ఇండస్ట్రీలో నిషేధం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు : రష్మిక

కన్నడ ఇండస్ట్రీలో నిషేధం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు : రష్మిక

కన్నడ చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించిందని వస్తున్న వార్తలను స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఖండించింది. కన్నడ చిత్ర పరిశ్రమ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని క్లారిటీ ఇచ్చింది. కాంతార చిత్ర విషయంలో తనపై కొంతమంది అత్యుత్సాహం చూపించారని తెలిపింది. కాంతార సినిమా చూసి చిత్ర బృందానికి మెసేజ్ పెట్టానని.. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదని రష్మిక వ్యాఖ్యానించింది. తన వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేనని చెప్పింది. మెసేజ్ లు కూడా బయటికి రిలీజ్ చేయలేనని.. తన వ్యక్తిగత జీవితం ప్రజలకు అవసరం లేదని తెలిపింది. వృత్తిపరంగా తాను ఏం చేస్తున్నానో అది ప్రజలకు చెప్పడం తన బాధ్యత అని రష్మిక వివరించింది.

రష్మిక తన సొంత ఇండస్ట్రీని చులకన చేసిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇంతవరకూ కాంతార సినిమా చూడనేలేదని, అంత టైం లేదని చెప్పింది రష్మిక. ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా గురించి చెప్పేటప్పుడు సోకాల్డ్‌ బ్యానర్‌లో చేశానంటూ నిర్మాణ సంస్థ పేర్లు కూడా ప్రస్తావించలేదు. ఇది కన్నడిగులకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్‌ సినిమా బ్యానర్‌ కూడా తెలీదా..? సో కాల్డ్‌ బ్యానర్‌ అని యాక్ట్‌ చేసి చెప్పడం ఎందుకు..? అంత యాటిట్యూడ్‌ అవసరమా..? అంటూ కన్నడ ప్రేక్షకులు రష్మిక పై మండిపడ్డారు. అటు రిషబ్‌ శెట్టి సైతం రష్మికపై పరోక్షంగా కామెంట్స్‌ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్‌ చేసిందంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో రష్మిక  తాజా వివరణ ఇచ్చింది.