
సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే, బాలీవుడ్‌లోనూ తన మార్కెట్‌ను పెంచుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా రష్మిక నటించిన లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ‘థామ’(Thama). ‘ది వరల్డ్ ఆఫ్ థామ’ అనేది ట్యాగ్ లైన్. హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రష్మిక నేడు (2025 అక్టోబర్ 21న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. తెలుగులో కూడా విడుదలైంది.
సూపర్ హిట్ చిత్రాలకు చిరునామా అయిన.. మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్లో ‘థామ’ నాల్గవ భాగం. ఈ యూనివర్స్ 2018లో బాక్సాఫీస్ సూపర్ హిట్ ఫిల్మ్ 'స్త్రీ'తో ప్రారంభమైంది. ఆ తర్వాత 2022లో భేడియా, 2024లో ముంజ్య, 2024లో స్త్రీ 2 వచ్చాయి. ఇపుడు థామ మూవీ. ఇది ఒకరకంగా అంచనాలు పెంచితే.. మరోవైపు, థామ వీడియో సొంగ్స్, టీజర్, ట్రైలర్ లతో యూత్ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది.
ఈ క్రమంలోనే థామపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు దీపావళి స్పెషల్గా వచ్చిన రష్మిక రొమాంటిక్ హార్రర్ కామెడీ ఎలా ఉంది? భయపెట్టిందా? లేక క్రేజీ ఫీలింగ్ అందించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
ఆజాద్ అనే టీవీ ఛానల్లో అలోక్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ రిపోర్టర్. తన తోటి మిత్రులతో కలిసి ఓ పర్వత ప్రాంతానికి న్యూస్ కవరేజ్ కోసం వెళతాడు. అలా దట్టమైన అడవిలోకి వెళ్లిన అలోక్ కి ఓ ప్రమాదం ఎదురవుతుంది. ఈ క్రమంలో అలోక్ని బేతాళ జాతికి చెందిన అమ్మాయి తడ్కా (రష్మిక మందన్న) రక్షిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్, తడ్కా ప్రేమించుకుంటారు. అలా అలోక్పై ఇష్టంతో బేతాళజాతిని వదిలేసి.. అతడితో జనాల్లోకి వెళ్తుంది. అయితే, తడ్కా ఒక బేతాళిని అనే విషయం అలోక్కి చాలా లేట్గా తెలుస్తుంది. ఈ జర్నీలో వీరిమధ్య చాలా జరుగుతుంది. ఈ క్రమంలోనే బేతాళుల నుంచి తడ్కకి పిలుపు రావడం, అదే టైంలో ఒక యాక్సిడెంట్లో అలోక్ చనిపోవడం జరుగుతుంది.
ఈ విషయం తెలుసుకున్న తడ్కా ఏం చేసింది? అలోక్‌కు తడ్కా ఓ బేతాళిని అని ఎలా తెలిసింది? అసలు బేతాళులు ఎవరు? ఎప్పట్నుంచి ఈ భూమ్మీద ఉంటున్నారు? బేతాళుల జీవిత లక్ష్యం ఏంటీ? ఇంతకు అలోక్ నిజంగానే చనిపోయాడా? ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ), బేతాళుల చేతిలో ఎందుకు బందించబడ్డాడు? ఈ కథకు మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్లో ‘భేడియా’, ‘ముంజ్యా’, ‘స్త్రీ 2’ చిత్రాలతో ఉన్న లింకేంటి? అన్నది తెలియాలంటే ‘థామ’ చూడాల్సిందే!
ఎలా ఉందంటే:
మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్.. ఇప్పటికే సక్సెస్ ఫుల్ హారర్ కామెడీ సినిమాలను తీసుకొచ్చింది. ఆడియన్స్ ఊహలకు ఏ మాత్రం అందకుండా ఉక్కిరిబిక్కిరి చేసే కథాంశాలతో రావడం ఈ యూనివర్స్ ప్రత్యేకత. ఇప్పటివరకు వచ్చిన మూడు చిత్రాలు భయాన్ని క్రియేట్ చేస్తూ.. హిందీ ఆడియన్స్కు కొత్త లోకాన్ని పరిచయం చేశాయి.
మన జానపదాల్లో తెలిసినవి, తెలియనివి ఎన్నో బేతాళ కథలున్నాయి. అయితే, ఆ జాతి వెనుక బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది మాత్రం ఎవ్వరికీ పెద్దగా తెలియదు. సరిగ్గా అలాంటి ఓ బేతాళ కథతోనే వచ్చి, లవ్ స్టోరీ, హారర్ పాయింట్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్తో ‘థామ’ వచ్చింది. థ్రిల్లింగ్ అంశాలు, విజువల్స్, హారర్ ఎలిమెంట్స్ హిందీ ఆడియన్స్కు సరికొత్త ఫీలింగ్ అందించేలా ఉంటుంది.
మూవీ స్టార్ట్ అవుతూనే.. గ్రీకు సామ్రాజ్య స్థాపకుడైన 'అలెగ్జాండర్' భారతదేశాన్ని ఆక్రమించడానికి వస్తాడు. అపుడు అలెగ్జాండర్‌ను బేతాళ నాయకుడు యక్షాసన్ అంతమొందించే హారర్ సీక్వెన్స్‌తో ఆసక్తి కలిగించేలా డిజైన్ చేశారు డైరెక్టర్.
ఆ తర్వాత కథ ప్రెసెంట్ లోకి వచ్చి.. హీరో అడవికి ఎంట్రీ ఇవ్వడం, అతన్ని ఓ ఎలుగుబంటి దాడి చేయడం, అప్పుడు రష్మిక వచ్చి రక్షించడం.. ఈ క్రమంలోనే ఒకరికొకరు ప్రేమించుకోవడం.. చక చకా నడిచిపోతాయి. ఇలా వీరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆసక్తికరంగా చెక్కి ఉంటే బాగుండేది. ఆడియన్స్ కి కొత్త అనుభూతి ఇవ్వలేకపోతుంది. అయితే, తడ్కా ఎవరనే సస్పెన్స్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ తడ్కా క్యారక్టర్నే ప్రధాన హైలెట్గా నిలిచింది. ఇంటర్వెల్లో తడ్కా ఎవరనేది అలోక్కి ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది.
సెకండాఫ్లో తడ్కా బేతాళిని అని.. రక్తం తాగుతుందని తెలిశాక.. హీరో పడే తిప్పలు ఆకట్టుకుంటాయి. అయితే, ఇవి కొంతమందికి బోరింగ్గా కూడా అనిపించవచ్చు. ఇక చివరి 20 నిమిషాలు బేతాళినిగా రష్మిక విజృంభించే తీరు, అప్పుడొచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ కలిగిస్తాయి. ఓవరాల్గా మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్లో వచ్చిన ఈ నాల్గొవ మూవీ.. హిందీ ఆడియన్స్కు ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. కానీ, తెలుగు ఆడియన్స్కు మాత్రం యావరేజ్ అనిపించొచ్చు. అయితే, రష్మిక కోసమైనా తెలుగు ఆడియన్స్ థామ చూసి తీరాల్సిందే!