లాక్​డౌన్​ అనంగనే.. ధరలు పెంచిన్రు

లాక్​డౌన్​ అనంగనే.. ధరలు పెంచిన్రు
  • రెండు నుంచి మూడింతలైన కూరగాయల ధరలు
  • రూ.15 ఉన్న కిలో టమాట.. రూ.50కి పెంపు
  • వంకాయ ధరలూ రెట్టింపు
  • మిగతా కూరగాయాల ధరలూ అంతే 

హైదరాబాద్​, వెలుగు: లాక్​డౌన్​ అని ప్రకటించారో లేదో కూరగాయల రేట్లు కూడా అమాంతం పెరిగిపోయాయి. కొందరు వ్యాపారులు రెండు నుంచి మూడింతల మేర ధరలను పెంచి అమ్మారు. పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కోసం ప్రభుత్వం అనుమతివ్వడంతో హైదరాబాద్​తో పాటు అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లోని సూపర్​ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లకు జనాలు క్యూ కట్టారు. అయితే, జనాలు ఎక్కువగా రావడం, హైదరాబాద్​తో పాటు కొన్ని పట్టణాలకు కూరగాయలు సరిపడా రాకపోవడం వంటి కారణాలతో డిమాండ్​ బాగా పెరిగింది. దీంతో వ్యాపారులు ధరలను భారీగా పెంచేశారు. ఎర్రగడ్డ రైతుబజార్​లో మొన్నటి దాకా కిలో రూ.15 ఉన్న టమాటను ఇప్పుడు రూ.40 నుంచి రూ.50 వరకు అమ్మారు. ఇతర జిల్లా, పట్టణ కేంద్రాల్లోనూ రూ.40 దాకా రేట్​ ఫిక్స్​ చేశారు. కిలో వంకాయలు రూ.20 ఉండగా.. రెట్టింపు రేటు రూ.40కి అమ్మారు.  కిలో మిర్చి ధర రూ.80కి పెంచారు. కిలో ఆలుగడ్డల మీద రూ.10 పెంచి రూ.50కి అమ్ముకున్నారు. మిగతా కూరగాయలది అదే పరిస్థితి. చిల్లర కొట్లలో అయితే ఆ ధరల కన్నా ఎక్కువకే అమ్మకాలు జరిగాయి.  

కిరాణ కొట్లు ఫుల్​
ఇళ్లకు దగ్గరుండే చిన్న చిన్న కిరాణ కొట్లతో పాటు సూపర్​ మార్కెట్లలోనూ జనాల రద్దీ కనిపించింది. ఎక్కువగా బియ్యం, పప్పులు, నూనెలు కొన్నట్టు షాపుల వాళ్లు చెప్పారు. విద్యానగర్​లోని రెండు సూపర్​మార్కెట్లలో 4 గంటల టైంలోనే 150  బస్తాల (50 కిలోలవి) బియ్యం అయిపోయాయి. వాటితో పాటు మ్యాగీ, బిస్కెట్లు, ఇతర శ్నాక్స్​ ఐటెంలనూ జనాలు కొనుగోలు చేశారు. సరుకుల ధరలు పెరగకపోయినా.. కూరగాయల రేట్లు పెరగడంపై జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది కొందామన్నా కొనే పరిస్థితి లేదని వాపోతున్నారు.   

సంపాదన కన్నా ఖర్చులే ఎక్కువ
మూడు, నాలుగు రోజులకు సరిపడా కూరగాయలు, సరుకులు తీసుకున్నా. వాటికే రూ.వెయ్యి దాటింది. నాలుగు రోజులకే అంత అయితే నెలకు రూ.8 వేల దాకా ఖర్చు పెట్టాల్సిందే. ఇంటి కిరాయి, గ్యాస్​, చిన్న ఖర్చులకే నెల సంపాదన అయిపోయేలా ఉంది. సంపాదన కన్నా ఖర్చులే ఎక్కువైతున్నాయి. అప్పులూ చేయాల్సి వస్తోంది.  
- ప్రపూర్ణ, గృహిణి, హైదరాబాద్

ఒక్కసారిగా పెంచిన్రు 
లాక్​డౌన్​ అని చెప్పుడే లేట్​.. నిత్యావసరాల రేట్లు పెంచేశారు. కూరగాయలు తీసుకుందామని వెళితే ఏది అడిగినా కిలో రూ.40 పైనే చెప్తున్నరు. ఇలాంటి టైంలో ధరలు పెంచి అమ్మడం సరికాదు. గతంలోనూ ఇలాగే చేశారు. ప్రభుత్వం నిత్యావసర ధరలపై మానిటరింగ్​ చేయాలి. లేకుంటే కరోనాతో అంతంత మాత్రంగానే ఉన్న మా జీతాలతో ఇళ్లు గడవడం కష్టమవుతుంది.
- కె. గణేశ్​, ప్రైవేట్​ ఎంప్లాయ్​, హైదరాబాద్​