న్యూఢిల్లీ: వంట నూనెల రిటెయిల్ రేట్లు ఈ ఏడాది డిసెంబర్ కల్లా తగ్గుముఖం పడతాయని ఫుడ్ సెక్రటరీ సుధాంశు పాండే చెప్పారు. అప్పటికి కొత్త పంటలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. వంట నూనెల అవసరాలలో 60 శాతాన్ని మనం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నాం. గ్లోబల్‌గా రేట్లు పెరగడంతో వంట నూనెల రేట్లు గత ఏడాది కాలంలో 64 శాతం పెరిగాయి. డిసెంబర్ ఫ్యూచర్స్ రేట్ల తగ్గుదల కనబడుతోందని, రిటెయిల్ రేట్లూ దీనికనుగుణంగానే తగ్గుతాయని పాండే చెప్పారు. చాలా దేశాలు బయో ఫ్యూయెల్స్ ప్రమోషన్‌కు పెద్దపీట వేస్తుండటంతో గ్లోబల్‌గా వంట నూనెల రేట్లు పెరిగాయని, దాంతో దేశంలోనూ రిటెయిల్ రేట్లు పెరిగాయని పాండే పేర్కొన్నారు. పామాయిల్‌ను ఎక్కువగా ఎగుమతి చేసే మలేషియా, ఇండోనేషియా దేశాలు రెండూ బయో ఫ్యూయెల్ పాలసీలను బాగా ప్రమోట్ చేస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమెరికా కూడా సోయాబీన్‌ను బయో ఫ్యూయెల్స్ తయారీకి మళ్లిస్తోందని అన్నారు. మన వంట నూనెల మార్కెట్లో పామాయిల్, సోయాబీన్ ఆయిల్లకే ఎక్కువ వాటా ఉందని సుధాంశు పాండే వివరించారు.
