
కుభీరు, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్ని తండాలో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం, తండాకు చెందిన రాథోడ్ తానాజీ(38) తనకున్న అర ఎకరంతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని, అందులో పత్తి ఇతర పంటలు వేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయాడు. దీంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.3 లక్షలు దాటాయి. వీటిని ఎలా తీర్చాలో తెలియక, కొన్ని రోజులుగా రాథోడ్ తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు.
ఈ క్రమంలో శనివారం ఉదయం పత్తి పంటకు స్ప్రే చేస్తానని చెప్పి పొలానికి వెళ్లాడు. అక్కడే పురుగుల మందు తాగాడు. రాథోడ్ వెళ్లిన కొద్దిసేపటి తర్వాత కుబుంబసభ్యులు కూడా పొలానికి వెళ్లడంతో అక్కడ అపస్మారక స్థితిలో పడిఉన్న రాథోడ్‌ను చూసి, వెంటనే భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.