రేషన్ కార్డులను ముద్రించినా..పంపిణీ చేయలె..

రేషన్ కార్డులను ముద్రించినా..పంపిణీ చేయలె..

రేషన్ కార్డుల పంపిణీలో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడింది. కరీంనగర్ పాత కలెక్టరేట్ కూల్చివేతలో ప్రజలకు పంపిణీ చేయని ఆహార భద్రత కార్డులు వెలుగుచూశాయి. కొత్త కలెక్టరేట్ నిర్మాణాన్ని చేపట్టిన సర్కారు..పాత కలెక్టరేట్ భవనాన్ని  కూల్చివేసింది. అయితే ఈ శిథిలాల కింద వందల కొద్దీ పంపిణీ చేయని రేషన్ కార్డులు బయటపడటం గమనార్హం. కలెక్టరేట్ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ  ఆహార భద్రత కార్డులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 

కార్డులపై ఈటల రాజేందర్ ఫోటో..
కలెక్టరేట్ శిథిలాల్లో బయటపడిన రేషన్ కార్డులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్ ఫోటోలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ కార్డులు ఈటల రాజేందర్ పౌరసరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు ముద్రించినట్లు తెలుస్తోంది. ఈ రేషన్ కార్డులన్నీ.. జగిత్యాల జిల్లాలోని వివిధ మండలానికి చెందనవి.   కరీంనగర్ జిల్లా విభజనకు ముందు వీటిని ముద్రించారు. కానీ లబ్దిదారులకు పంపిణీ చేయలేదు. కేవలం కార్డులను ముద్రించి ఇంతకాలం అధికారులు కలెక్టరేట్లో భద్రపరిచారు. ప్రస్తుతం కూల్చివేతతో  బయటపడ్డాయి. 

గతేడాది నుంచి కొత్త రేషన్ కార్డులు..
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. 2014లో తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా..కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులను అవకాశం ఇవ్వలేదు. ఇక 2018లో రెండోసారి అధికారం చేపట్టాక కూడా..కొత్త రేషన్ కార్డుల జారీ ఊసెత్తలేదు. అయితే దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవడంతో..గతేడాది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.