రేషన్ షాపులు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ : బియ్యం రీసైక్లింగ్ చేస్తే చర్యలు

రేషన్ షాపులు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ : బియ్యం రీసైక్లింగ్ చేస్తే చర్యలు

రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోమవారం హుజూర్‌నగర్‌లోని రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన ఆయన.. మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి బియ్యం, ఇతర సేవల నాణ్యతను పరిశీలించిన తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు 54 లక్షల మంది రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు 5 కేజీలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 కేజీ బియ్యం అందుతున్నాయని తెలిపారు. అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం మరో 35 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 6 కేజీల బియ్యాన్ని అందిస్తుందని వివరించారు. తెలంగాణాలో 89 లక్షల కుటుంబాలకు నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం నాణ్యత, ఇతర అంశాలపై రేషన్ డీలర్లతో మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చర్చించారు. 


 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  నుండి మొత్తం సేకరణ ఖర్చు కిలోకు రూ. 39 అని అన్నారు. అయితే, దాదాపు 70-నుంచి 75% రేషన్ బియ్యాన్ని మిల్లర్లు మరియు ఇతర అసాంఘిక సంస్థలు రీసైకిల్ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తుందన్నారు. బియ్యం రీసైక్లింగ్‌లో ప్రమేయం ఉన్న వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఉత్తమ్.

రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లు లేదా ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌పై దాదాపు 56 వేల  కోట్ల రూపాయిల అప్పుల భారం మోపిందన్నారు. 2014లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు అప్పు 33వందల కోట్ల రూపాయిలు  మాత్రమేనన్నారు. ప్రస్తుతం రేషన్ పంపిణీ, వరి ధాన్యం సేకరణ బాధ్యత కలిగిన కార్పొరేషన్ వార్షిక వడ్డీ భారం రూ.3,000 కోట్లు దాటిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఈ శాఖ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో దశాబ్ధ కాలంగా కార్పొరేషన్‌కు రూ.11 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.