మారనున్న చౌకధరల దుఖానాల రూపురేఖలు

మారనున్న చౌకధరల దుఖానాల రూపురేఖలు

హైదరాబాద్‌: చౌకధరల దుకాణాల రూపురేఖలు మారనున్నాయి. డీలర్లకు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు కేంద్రం వివిధ రకాల ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంటర్‌నెట్‌, పౌరసేవలను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుండగా, మరికొన్ని చోట్ల ఇతర ఉత్పత్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కార్డుదారులకు అందజేస్తోంది. తెలంగాణలో బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. త్వరలో డీలర్ల ద్వారా సిలిండర్ల విక్రయానికి కేంద్రం శ్రీకారం చుట్టనుంది. పీఎం వాణి పేరిట వైఫై సేవలను రేషన్‌ దుకాణాల ద్వారా అందుబాటులోకి తేనుంది. రేషన్‌ దుకాణాల వద్ద వైఫై స్పాట్లను ఏర్పాటు చేయటం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్‌నెట్‌ సేవలను విస్తరించాలన్నది వ్యూహంగా ఉంది. ఆ సేవలను వినియోగించుకున్న వారి నుంచి వసూలు చేసే మొత్తంలో కొంత మొత్తాన్ని కమీషన్‌గా డీలర్లకు ఇవ్వనున్నారు.

పౌర సేవల(సిటిజన్‌ సర్వీసెస్‌)ను కూడా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వివిధ రకాల బిల్లులను ఈ దుకాణాల ద్వారా చెల్లించేలా పౌరసరఫరాల శాఖ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం వస్తున్న కమీషన్‌ అంతంతమాత్రంగా ఉండటంతో దుకాణాల నిర్వహణ కష్టంగా ఉందని రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ అధ్యక్షుడు రాజు చెప్పారు. కమీషన్‌ పెంచడంతో పాటు బీమా తదితర సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి పలు దఫాలు కోరామన్నారు. కేంద్ర ప్రణాళికలు కార్యరూపంలోకి వస్తే ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

రష్యాతో యుద్ధం చేసేందుకు తిరిగొచ్చిన ఉక్రెనియన్లు

డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నికలకు వెళ్తడు