
- గురుకుల హాస్టల్‌లో 10 మంది అమ్మాయిలకు గాయాలు
- సూర్యాపేట జిల్లా సింగిరెడ్డిపాలెంలో ఘటనఎల్లారెడ్డి
- ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లోనూ సేమ్ సీన్
సూర్యాపేట, ఎల్లారెడ్డి, వెలుగు: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెంలోని మహాత్మా జ్యోతి రావు పూలే బాలికల గురుకుల స్కూల్ హాస్టల్‌లో విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. నిద్రిస్తున్న అమ్మాయిలను కొరకడంతో 10 మంది గాయపడ్డారు. కొంతమందికి అరికాళ్లలోని చర్మమే ఊడిపోయింది. వారికి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేయించారు. ఎలుకల వల్ల తాము నిద్ర కూడా పోలేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు. ఈ హాస్టల్‌లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 520 మంది విద్యార్థులు ఉంటున్నారు. నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది కూడా ఎలుకలు కరిచాయని, తరచూ ఇలాంటి ఘటనలు రిపీట్అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు విషయాన్ని తమకు చెప్పకుండానే ట్రీట్‌మెంట్ చేయించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఎల్లారెడ్డి హాస్టల్‌లో ఏడుగురికి గాయాలు..
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఆదివారం రాత్రి నిద్రిస్తున్న ఏడుగురు స్టూడెంట్స్‌ను ఎలుకలు కరిచాయి. రాత్రి ఎలుకలు కరవడంతో నొప్పితో లేచిన స్టూడెంట్లు.. డ్యూటీలో ఉన్న హెల్త్స్టాఫ్కు చెప్పారు. గాయాలను డెటాల్‌తో క్లీన్ చేశారు. తెల్లారిన తర్వాత సీహెచ్‌సీకి తీసుకువెళ్లి, ట్రీట్మెంట్చేయించి హాస్టల్‌కు పంపారు.