
- కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్‌టసీ ట్యాబ్లెట్ల స్వాధీనం
- ఓ మహిళ సహా ఆరుగురు అరెస్ట్..పరారీలో మరో ఇద్దరు
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని కొండాపూర్‌లో ఉన్న రాజేశ్వరీ నిలయం సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి పోలీసులు, తెలంగాణ ఈగల్ టీమ్ కలిసి
చేపట్టిన ఆపరేషన్‌లో ఒక మహిళతో సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఎండీఎంఏ, 20 ఎక్స్‌టసీ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పడ్డుబడినవారిని తేజ (28), విక్రమ్, నీలిమా (41), పురుషోత్తం రెడ్డి (36), భార్గవ్ (31), చందన్ (20)గా గుర్తించారు.
బెంగళూరుకు చెందిన డ్రగ్ సరఫరాదారుడు రాహుల్, రాజమండ్రి డిప్యూటీ ఎమ్మార్వో మణిదీప్ పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను సోమవారం గచ్చిబౌలిలోని డీసీపీ అఫీస్‌లో మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు.
హైదరాబాద్‌లో నెట్‌వర్క్ బట్టబయలు
ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన తేజ, జొన్నాడకు చెందిన విక్రమ్, రాజమండ్రికి చెందిన మన్నే నీలిమాలు హైదరాబాద్‌లో రేవ్ పార్టీలకు అలవాటు పడ్డారు. తేజ ప్రగతినగర్‌లో క్లౌడ్ కిచెన్ వ్యాపారం చేస్తుండగా, విక్రమ్ శేరిలింగంపల్లిలో, నీలిమా నార్సింగిలో నివాసం ఉంటున్నారు. ఈ ముగ్గురు స్నేహితులు రాజమండ్రిలో డిప్యూటీ ఎమ్మార్వో మణిదీప్ నిర్వహించే ఫామ్‌హౌస్ రేవ్ పార్టీలకు హాజరయ్యేవారు. మణిదీప్ బెంగళూరు, గోవాలోనూ డ్రగ్స్ పార్టీలు నిర్వహించాడు. 2023లో గోవాలో జరిగిన పార్టీలో వీరు డ్రగ్ సరఫరాదారు రాహుల్‌ను కలిశారు. రాహుల్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని సేవించేవారు. హైదరాబాద్‌కు మకాం మార్చిన తర్వాత కొండాపూర్‌లోని రాజేశ్వరీ నిలయం సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో గదులు అద్దెకు తీసుకుని రేవ్ పార్టీలు నిర్వహించేవారు.
గ్లుటాథోన్ ఇంజెక్షన్ పేరుతో డ్రగ్స్ సప్లయ్
తేజ తన చర్మ కాంతి కోసం గ్లుటాథోన్ ఇంజెక్షన్లు వాడేవాడు. హైదరాబాద్‌లో రూ.40వేలు ఉన్న ఈ ఇంజెక్షన్లు బెంగళూరులో రూ.11వేలకు లభిస్తాయి. దీంతో, బెంగళూరుకు చెందిన రాహుల్.. గ్లుటాథోన్ పేరుతో తేజకు డ్రగ్స్ సరఫరా చేశాడు. బెంగళూరులో చదువుతున్న చందన్ ద్వారా రాహుల్ డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు పంపించాడు.ఈ నెల 24న తేజ, విక్రమ్, నీలిమలతో పాటు కొండాపూర్ లోని వైన్ షాపు యజమాని పురుషోత్తం రెడ్డి (36), సైబర్ మిడోస్ లో నివాసం ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్గవ్(31)లు కలిసి సర్వీసు అపార్టుమెంటులో రేవ్ పార్టీ చేసుకుంటున్నారు.
వీరికి రాహుల్ పంపించిన డ్రగ్స్‌ను చందన్ సరఫరా చేశాడు. సమాచారం అందుకున్న తెలంగాణ ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు దాడులు చేసి పార్టీని భగ్నం చేశారు. పార్టీలో ఉన్న పలువురితో పాటు డ్రగ్స్ రవాణా చేసిన చందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న రాహుల్, మణిదీప్ కోసం గాలిస్తున్నారు.