
- హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన రాచకొండ పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా: మహాశివరాత్రి సందర్భంగా బంపర్ ఆఫర్.. ఉత్తరాది అమ్మాయిలతో గ్రాండ్ పార్టీ.. ఎంట్రీ టికెట్ కేవలం 500లే అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చూసి.. వెళ్లిన 90 మంది స్టూడెంట్స్ అడ్డంగా బుక్కయ్యారు. రేవ్ పార్టీ అని ఇన్ డైరెక్టుగా తెలుసుకుని వెళ్లిన వీరంతా పోలీసులకు పట్టుబడి భవిష్యత్తును అంధకారం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పట్టుపడిన 90 మంది విద్యార్థులతోపాటు మరో ఏడుగురు, ఇద్దరు మహిళలు, ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. పక్కా సమాచారంతో ఈ రేవ్ పార్టీని భగ్నం చేశామని ఆయన తెలిపారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిపై సెక్షన్ 188, 294 కింద కేసు నమోదు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో నార్కొటిక్ డ్రగ్స్ దొరికాయని, ఇవి ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని ఆయన వివరించారు.
ఎంటర్ టైన్ మెంట్ పేరుతో రేవ్ పార్టీ
మహా శివరాత్రి సందర్భంగా గొప్ప ఎంటర్ టైన్ మెంట్ పేరుతో రేవ్ పార్టీకి తెరలేపారు నిర్వాహకులు. ఇన్ స్ట్రాగ్రాం లో అంతరాత్మ ప్రొడక్షన్స్ పేరుతో ఒక పోస్టు చేశాడు గిరీష్. రేపు పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంచాడు గిరీష్. ఎంట్రన్స్ టికెట్ రూ.500 మాత్రమే అని ప్రకటించారు. ఈ రేవ్ పార్టీ కోసం 25000 రూపాయలు ఇచ్చి ఢిల్లీ నుండి డీజేను పిలిపించారు. అంతేకాదు రేవ్ పార్టీకి వచ్చిన వారికి గిరీష్ డ్రగ్స్ తెప్పించి సిద్ధంగా ఉంచారు. రాత్రి పొద్దుపోయే కొద్ది టికెట్లు బుక్ చేసుకున్న వారంతా వస్తుండడంతో రేవ్ పార్టీ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసుకున్న సమయంలో.. హఠాత్తుగా పోలీసులు వచ్చిపడ్డారు.
సీక్రెట్ గా పోలీసుల దాడి
ఒక వైపు జగ్‌నే కీ రాత్... ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు కార్యక్రమాల వల్ల శాంతిభద్రతలకు ఇబ్బంది రాకుండా పోలీసులు అన్ని విధాల నిఘా పెట్టారు. ఈ నేపధ్యంలో ఇన్ స్టాగ్రాంలో పెట్టిన పోస్టుపై అనుమానంతో ఆరా తీయగా.. రేవ్ పార్టీ అని తేలింది. పక్కా సమాచారంతో ధృవీకరించుకున్న రాచకొండ పోలీసులు సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో దాడి చేశారు. రేవ్ పార్టీలో పాల్గొనేందుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ దొరికాయి. గంజాయితో పాటు ఎల్‌ఎస్‌డీ, మరొక డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ లో మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం విదేశీ కల్చర్. అదే తరహాలో ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకులపై నార్కొటిక్స్ డ్రగ్స్ (ndps) యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్ లతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీ లో పాల్గొన్న వారిపై సెక్షన్ 188, 294 కింద కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు రాచకొండ సీపీ మహేష్ భగవత్.
పార్టీలో పాల్గొన్న విద్యార్థులకు ఉద్యోగాలు రావు
ఇలాంటి పార్టీలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు అవుతాయి, విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు రావు అని రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు.. ఏం చేస్తున్నారో తరచూ ఆరా తీస్తూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. లేదంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులై భవిష్యత్తును నాశనం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఇక్కడ పట్టుపడిన వారందరిపై కేసులు నమోదు చేశామని.. డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయన్న విషయం పైఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.