ఆ రోజు కోహ్లీ, రోహిత్ కన్నీళ్లు ఆగలేదు: రవిచంద్రన్ అశ్విన్

ఆ రోజు కోహ్లీ, రోహిత్ కన్నీళ్లు ఆగలేదు: రవిచంద్రన్ అశ్విన్

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతన్నారు. ఫామ్ లో ఉన్న మన ఆటగాళ్లు సొంత గడ్డపై ఈ సారి కప్ కొట్టడం గ్యారంటీ అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. అంచనాలకు తగ్గట్టుగానే ఫైనల్ కు వెళ్లిన రోహిత్ సేన ఆస్ట్రేలియా అడ్డంకిని అధిగమించలేకపోయింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరిందింది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో భారత ప్లేయర్లందరూ భావోద్వేగానికి గురయ్యారు. 

ఇంతవరకు తెలిసిన విషయమే అయినా తాజాగా సీనియర్ స్పిన్నర్ అశ్విన్.. విరాట్, రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ లో కన్నీళ్లు పెట్టుకున్నారని  వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎస్ బద్రీనాథ్‌తో మాట్లాడిన అశ్విన్.. ఫైనల్ ఓటమి తర్వాత క్షణాలను గుర్తు చేసుకున్నాడు. విరాట్, రోహిత్ వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారని.. ఆ రోజు నాకు చాలా బాధగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఇద్దరికీ చాలా అనుభవం ఉందని.. ఎప్పుడేం చేయాలో వీరికి తెలుసని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
 
కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ 'మీరు ఇండియన్ క్రికెట్ లో ఎంఎస్ ధోని అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడని అందరూ చెబుతారు. కానీ రోహిత్ శర్మ అద్భుతమైన వ్యక్తి. అతను జట్టులోని ప్రతి వ్యక్తిని అర్థం చేసుకుంటాడు. మాలో ప్రతి ఒక్కరి  ఇష్టాలు ఏమిటో రోహిత్ కు తెలుసు. అతనికి అందరిపై గొప్ప అవగాహన ఉంది. ప్రతి ప్లేయర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. జట్టులో ప్రతి ఒక్కరిలో  ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు'. అని అశ్విన్ పేర్కొన్నాడు.