ఆస్ట్రేలియా మనల్ని మోసం చేసింది.. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై అశ్విన్

ఆస్ట్రేలియా మనల్ని మోసం చేసింది.. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై అశ్విన్

ఓటమి.. ఓటమి.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసి దాదాపు నాలుగు రోజులు గడుస్తున్నా దీనిపై విమర్శలు, విశ్లేషణలు ఆగడం లేదు. రోజుకొకరు చొప్పున కొత్త వాదనను తెరమీదకు తెస్తున్నారు. తాజాగా, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ బౌలింగ్‌ ఎంచుకోవడం వెనుకున్న రహస్యాన్ని భారత సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ బయటపెట్టారు. దానిని బట్టి కంగారూ జట్టు ఎంత లోతుగా ఆలోచించిందో మనం అర్థం చేసుకోవచ్చు.  

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్‌ నెగ్గగానే తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇది భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహా అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, దీని వెనుక ఉన్న కారణమేంటనేది తాజాగా అశ్విన్‌ బయటపెట్టారు. మ్యాచ్‌ మధ్యలో ఆసీస్ చీఫ్‌ సెలక్టర్ జార్జ్‌ బెయిలీని ఇదే విషయపై అడిగితే విస్తుపోయేలా సమాధానం ఇచ్చారని అశ్విన్‌ తెలిపారు.

"ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అమలు చేసిన వ్యూహాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ జట్టును నడిపించిన తీరు అద్భుతం. నలుగురు నుంచి ఐదు మంది ఫీల్డర్లను ఆఫ్ సైడ్ పెట్టి.. పరుగులు రాకూండా కట్టడి చేశాడు. భారత ఇన్నింగ్స్ కు పునాది అయిన కోహ్లీ, అయ్యర్‌లను వ్యూహాత్మకంగా ఔట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నిర్ణయం నన్ను వ్యక్తిగతంగానూ మోసం చేసింది. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో నేను జార్జ్‌ బెయిలీని కలిశా. టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకుంటారు? కదా అలా ఎందుకు చేయలేదు? అని అతన్ని అడిగా. అందుకు అతను నా మైండ్ బ్లాక్ అయ్యే సమాధానమిచ్చాడు.."

"మేం ఇక్కడ ఐపీఎల్‌ మ్యాచ్ లు, ద్వైపాక్షిక సిరీస్‌లు చాలా ఆడాం. ఎర్రమట్టితో చేసిన పిచ్ అయితే మ్యాచ్‌ జరుగుతున్నంతసేపూ పగుళ్లు వస్తుంటాయి. అదే నల్ల మట్టితో చేసిన పిచ్‌ అలా ఉండదు. పగుళ్లు ఉండవు. తేమ పడే కొద్దీ కాంక్రీట్‌లా గట్టిగా మారుతుంది. బ్యాటింగ్ ఈజీగా చేయొచ్చు అని అతనిచ్చిన సమాధానం నన్ను విస్తుపోయేలా చేసింది.. " అని అశ్విన్‌ తన యూట్యూబ్‌లో వెల్లడించాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ జట్టు 240 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. అనంతరం ఆసీస్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.