Jadeja:రవీంద్రజడేజా వేలికి క్రీమ్...ఐసీసీ ఫైన్

Jadeja:రవీంద్రజడేజా వేలికి క్రీమ్...ఐసీసీ ఫైన్

నాగ్ టెస్టులో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన రవీంద్రజడేజాకు ఐసీసీ షాకిచ్చింది. జడేజాకు ఐసీసీ జరిమానా విధించింది. తొలి టెస్టులో ఫీల్డ్ అంపైర్ అనుమతి లేకుండా జడేజా తన వేలికి క్రీమ్ రాసుకుని నిబంధనలు అతిక్రమించాడని ఐసీసీ పేర్కొంది. 

జరిమానా ఎంత..?

నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా  ఇన్నింగ్స్, 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే  మ్యాచ్ ముగిసిన నిమిషాల్లోనే జడేజా మ్యాచ్ ఫీజులో 25 శాతం  కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతంతో పాటు..అతని ఖాతాలో డీ మెరిట్ పాయింట్ను కూడా ఐసీసీ చేర్చింది. జడేజా మైదానంలో క్రీమ్‌ని రాసుకునే ముందు ఫీల్డ్ అంపైర్ల నుంచి అనుమతి తీసుకోలేదని....ఇది కచ్చితంగా ఐసీసీ  నిబంధనల్ని ఉల్లంఘించడమేనని ఐసీసీ పేర్కొంది. ఇందుకోసమే జడేజాకు జరిమానా విధించినట్లు వెల్లడించింది. 

ఏం రాసుకున్నాడు..?

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 120 పరుగులు చేసింది. అప్పటికే జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. మరోసారి బౌలింగ్ వేసేందుకు వచ్చిన జడేజా 46వ ఓవర్‌ను వేశాడు. అయితే ఈ ఓవర్‌ వేయడానికి ముందు జడేజా బంతితో సిరాజ్‌ దగ్గరికి వెళ్లాడు. సిరాజ్ దగ్గర  ఏదో పదార్థాన్ని తీసుకుని బంతిని స్పిన్‌ చేసే వేలికి రాసుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఫీల్డింగ్‌ సెట్‌ గురించి మాట్లాడి బౌలింగ్‌ వేశాడు. ఈ వీడియో వైరల్గా మారడంతో జడేజా ఏం రాసుకున్నాడని చర్చనీయాంశంగా మారింది. 

ఆసీస్ మీడియా విషపు ప్రచారం..

జడేజా తన వేలిపై ఏం రాసుకున్నాడని ఆస్ట్రేలియా మీడియా విషపు ప్రచారానికి తెరలేపింది.  అటు ఆస్ట్రేలియా మీడియా వార్తలకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మద్దతు పలికేలా వ్యాఖ్యలు చేశాడు. జడేజా తన వేలికి ఏదో పూసుకున్నాడని...దాన్ని గతంలో చూడలేదంటూ ట్వీట్ చేశాడు.  ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ టిమ్‌ ఫైన్‌ కూడా ఈ వీడియో గురించి 'ఇంట్రెస్టింగ్‌' అంటూ  కామెంట్ చేశాడు.

టీమిండియా మేనేజ్ మెంట్ క్లారిటీ..

జడేజా అంశంపై టీమిండియా మేనేజ్‌మెంట్ స్పందించింది. ఈ విషయం ముదరకముందే మ్యాచ్ రిఫరీకి విషయాన్ని వెల్లడించింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దగ్గరికి వెళ్లి జడేజా తన వేలికి ఆయింట్‌మెంట్ రాసుకున్నాడని అని చెప్పింది. ఇది కేవలం నొప్పిని నివారించడానికే అని వివరణ ఇచ్చింది. అయితే ఈ  విషయంపై ఆస్ట్రేలియా టీమ్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ ఇలాంటి ఘటనలపై విమర్శలు వ్యక్తమైతే రిఫరీ స్వతంత్రంగా విచారణ చేసే అవకాశం ఉంది. బాల్ షేప్ మారకుండా  నిబంధనల ప్రకారం  ఆటగాళ్లు ఏదైనా రాసుకోవాలని అనుకున్నప్పుడు అంపైర్ అనుమతి తప్పనసరి. ఈ నేపథ్యంలో వివాదం పెద్దది కాకముందే స్పందించిన టీమిండియా మేనేజ్మెంట్..రిఫరీకి విషయాన్ని వివరించింది. దీంతో ఈ వివాదం ముగిసిందని అంతా అనుకున్నారు.

తొలి టెస్టులో జడేజా అదుర్స్..
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జడేజా అద్బుతంగా ఆడాడు. ఆల్ రౌండ్ షోతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో ఆసీస్ నడ్డివిరిచిన జడేజా..బ్యాటింగ్లో సూపర్ హాఫ్ సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టడంతో..అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.