IND vs ENG: ఉప్పల్ ఓటమి ఎఫెక్ట్.. స్టార్ ఆటగాళ్ల స్థానంలో సర్ఫరాజ్, సుందర్

IND vs ENG: ఉప్పల్ ఓటమి ఎఫెక్ట్.. స్టార్ ఆటగాళ్ల స్థానంలో సర్ఫరాజ్, సుందర్

తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత భారత జట్టుకు కష్టాలు ఎక్కువయ్యాయి. స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. జడేజాకు హార్మ్ స్ట్రింగ్ గాయంతో బాధపడుతుండగా.. రాహుల్ ని కుడి భుజం గాయం వేధిస్తుంది. వీరిద్దరూ రెండో టెస్టులో ఆడటం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రాహుల్ తొలి ఇన్నింగ్స్ లో 86 పరుగులు చేస్తే.. జడేజా 87 పరుగులు చేయడంతో పాటు రెండు ఇన్నింగ్స్ ల్లో 5 వికెట్లు తీసి జట్టును ఆదుకున్నారు.

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా జడేజా కాలుకు గాయమైంది. జోరూట్ వేసిన 39వ ఓవర్‌లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి జడేజా రనౌటయ్యాడు.  పరుగు కోసం వేగంగా పరిగెత్తిన క్రమంలో జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. దీంతో అతను ఇబ్బంది పడుతూనే మైదానాన్ని వీడాడు. జడేజా తొడకండరాల గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. జడేజా గాయం ఊహించిందే అయినా.. రాహుల్ కూడా గాయపడడం భారత్ ను తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. 
   
జడేజా, రాహల్ రెండో నుంచి తప్పుకోవడంతో వీరికి రీప్లేస్ గా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను భారత జట్టులోకి చేర్చారు. దేశవాళీలో పరుగుల పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కు ఎట్టకేలకు స్థానం దక్కింది. ఆల్ రౌండర్లు సుందర్, సౌరబ్ కుమార్ నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి 2 న వైజాగ్ లో రెండో టెస్టు జరుగుతుంది. ఇప్పటికే ఈ టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే.