రజాకార్ చిత్రంపై నిషేధం విధించాలి.. హిందూ ముస్లింల మధ్య చీలిక తెచ్చేందుకే..

రజాకార్ చిత్రంపై నిషేధం విధించాలి.. హిందూ ముస్లింల మధ్య చీలిక తెచ్చేందుకే..

రజాకార్ చిత్రం రాష్ట్ర రాజకీయాల్లో వివాదం రేపుతోంది. ఈ సినిమా పోస్టర్పై వివాదం చెలరేగగా..తాజాగా ఈ సినిమాను నిషేధించాలని మజ్లిస్ బచావో తెహ్రీక్ అధికార ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ డిమాండ్ చేశారు. 1948లో ఇండియన్ యూనియన్‌తో హైదరాబాద్ రాష్ట్రం విలీనానికి సంబంధించిన కల్పిత కథల ఆధారంగా హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే రజాకార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఆయన విమర్శించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసమే బీజేపీ ఆధ్వర్యంలో  రజాకార్ చిత్రం రూపొందుతోందని అమ్జద్ ఉల్లా ఖాన్ ఆరోపించారు.  రజాకార్‌  చిత్రం వక్రీకరించిన చరిత్ర, ఊహలతో రూపొందుతోందని....ఇది  ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందన్నారు. ఈ చిత్రాన్ని  రాజకీయ నాయకుడు గూడూరు నారాయణ నిర్మిస్తున్నారని తెలిపారు. గూడూరు నారాయణ.. 2018 ఎన్నికల సమయంలో పార్టీ నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఎదుర్కొని కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరారని చెప్పారు. 

రజాకార్‌  అనేది ఉర్దూ పదమని.. దీని అర్థం స్వచ్ఛందం  అని అమ్జద్ ఉల్లా ఖాన్ తెలిపారు. అయితే  హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి సోకిన సమయంలో ఎంతో మంది ప్రజలు  స్వచ్ఛందంగా బాధిత ప్రజలకు సేవ చేశారని..అప్పట్లో  ఉర్దూ హైదరాబాద్ రాష్ట్ర అధికార భాష కాబట్టి ఆ ప్రజలను రజాకార్‌  అని పిలిచేవారని ఆయన గుర్తు చేశారు. కానీ  కొంతమంది మితవాద చరిత్రకారులు మజ్లిస్-ఎ -ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌తో సంబంధం ఉన్న కల్పిత ప్రైవేట్ సైన్యం సభ్యులకు రజాకార్ పనిని ఆపాదించారని మండిపడ్డారు. 

బీజేపీ నేతలకు చరిత్ర, ఉర్దూ భాషపై అవగాహన లేదని అమ్జెద్ ఉల్లాఖాన్ విమర్శించారు.  ఉర్దూలో  రజాకార్‌  అంటే స్వచ్చంద సేవకుడు అని అర్థం అన్నారు. ఉర్దూలో  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అంటే  రజాకార్ల సంఘం అని.. హిందీలో స్వయం సేవక్  అని..ఇంగ్లీషులో వాలంటీర్ అని  అర్థం చేసుకోవాలని బీజేపీ నేతలను ఆయన కోరారు.  రజాకార్  చిత్రం ద్వారా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. ఈ చిత్రానికి అనుమతిస్తే, లక్షలాది మంది ముస్లింలను దారుణంగా ఊచకోత కోశారని ఆరోపిస్తూ ఎవరైనా ‘పోలీస్ యాక్షన్’ సీక్వెల్ తీస్తారని ఆయన అన్నారు. రజాకార్ల  చుట్టూ ఉన్న కథలు కల్పితం, ప్రచారం అయితే పోలీస్ యాక్షన్  సమయంలో జరిగిన అకృత్యాలు 1948 సంఘటనల తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం నియమించిన బృందం తయారు చేసిన పండిట్ సుదర్‌లాల్ నివేదికలో నమోదు చేయబడ్డాయన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని..అందులో భాగంగానే రజాకార్ సినిమాను నిర్మిస్తున్నారని అమ్జద్ ఉల్లా ఖాన్ తెలిపారు. 75 ఏళ్లకు పైగా జరిగిన సంఘటనల ఆధారంగా  రజాకార్  చిత్రాన్ని రూపొందించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో  మరింతగా చీలిక వస్తుందని... సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ఆమోదం తెలపబోదన్నారు.  ప్రజలను రెచ్చగొట్టే సినిమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.  హింసను సృష్టించడం.. శాంతి, మత సామరస్యాన్ని కాపాడుకోవడంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంటే, సినిమా విడుదలకు ముందే నిషేధించాలని ఆయన అన్నారు.