ఎకానమీకి ఎంతో మేలు..

ఎకానమీకి ఎంతో మేలు..

న్యూఢిల్లీ: ఆర్‌‌‌‌‌‌బీఐ డిజిటల్ కరెన్సీ/డిజిటల్ రూపాయి 2023 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేట్ కంపెనీ ఎలక్ట్రానిక్ వాలెట్ల మాదిరిగానే ఇదీ ఉంటుంది. సాధారణ రూపాయికి ఎలక్ట్రానిక్ రూపం అన్నమాట! అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. అంటే చట్టబద్ధత ఉంటుందని  ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. సెంట్రల్ బ్యాంక్ మద్దతుతో 'డిజిటల్ రూపాయి'ని త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రతి అధికారిక కరెన్సీకి ఒక విశిష్ట సంఖ్య ఉన్నట్లే, ఆర్‌‌‌‌బీఐ జారీ చేసే డిజిటల్ కరెన్సీని కూడా  యూనిట్లలో లెక్కిస్తారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. "డిజిటల్ రూపాయి విధానంలో జారీ అయిన యూనిట్లు చెలామణిలో ఉన్న కరెన్సీలో చేరుతాయి. సాధారణ కరెన్సీకి, దీనికి పెద్దగా తేడా ఉండదు.  ఇది సాధారణ కరెన్సీకి  ఎలక్ట్రానిక్ రూపం అనుకోవచ్చు. మరింత సులువైన భాషల్లో వివరించాలంటే ఇది ప్రభుత్వ ఎలక్ట్రానిక్  వాలెట్అనుకోవచ్చు”అని ఆయన వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డిజిటల్ రూపాయి అందుబాటులోకి వస్తుందని ఆర్‌‌బీఐ వర్గాలు వెల్లడించాయి. రిజర్వ్ బ్యాంక్ డెవలప్ చేస్తున్న బ్లాక్‌‌చెయిన్ డిజిటల్ రూపాయి, ప్రైవేట్ కంపెనీలు అందించే మొబైల్ వాలెట్ సిస్టమ్‌‌లా కాకుండా అన్ని లావాదేవీలను ట్రేస్ చేయగలుగుతుంది.  ప్రైవేట్ కంపెనీలు అందించే ఎలక్ట్రానిక్ వాలెట్‌‌ను ఉపయోగించి, ప్రజలు ప్రస్తుతం డబ్బును మరో వాలెట్‌‌కి బదిలీ చేస్తున్నారు.  ఆ కంపెనీ కస్టమర్ తరఫున డబ్బును మనం సూచించిన వ్యాపారికి చెల్లిస్తుంది. ఇక్కడ ప్రైవేటు కంపెనీ పాత్రను ఆర్‌‌‌‌బీఐ పోషిస్తుంది.  "డిజిటల్ రూపాయి అంటే.. మీరు నోటును పట్టుకునే బదులు అది మీ ఫోన్‌‌లో డిజిటల్ కరెన్సీ రూపంలో ఉంటుంది. ఇదంతా సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉంటుంది.  అక్కడ నుండి అది ఏదైనా వ్యాపారికి బదిలీ అవుతుంది. దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది”అని బ్యాంకు వర్గాలు వివరించాయి. ఒక ప్రైవేట్ కంపెనీ  ఎలక్ట్రానిక్ -వాలెట్‌‌కు డబ్బు బదిలీ అయితే, అటువంటి కంపెనీలు విధించే ఛార్జీలతో పాటు ఆ డబ్బు కూడా కంపెనీ క్రెడిట్ రిస్క్‌‌కు చేరుతుంది. ఇక నుంచి ఈ– వాలెట్‌‌ని తీసుకువెళ్ళే బదులు, ఫోన్‌‌లోనే డబ్బు తీసుకువెళ్లవచ్చు. 

సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టడం డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. "డిజిటల్ కరెన్సీ మరింత సమర్థవంతమైన,  చౌకైన కరెన్సీ నిర్వహణ వ్యవస్థకు ఉపకరిస్తుంది. బ్లాక్‌‌చెయిన్  వంటి టెక్నాలజీలను ఉపయోగించి, 2022–-23 నుండి డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించాం" అని మంత్రి చెప్పారు. డిజిటల్ రూపాయిని కంట్రోల్ చేసే కచ్చితమైన రెగ్యులేటరీ మెకానిజం ఇంకా ఖరారు కాలేదు. సీబీడీసీని  ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు లేదా క్రిప్టోకరెన్సీతో పోల్చలేం. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు.. వాటి విలువకు బాధ్యత వహించవు. నష్టాలకు బాధ్యత వహిం చవు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు ఎప్పటికీ చట్టపరమైనవి కాదని ప్రభుత్వం ఇప్పటికే చెప్పిం ది. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై కంట్రోల్ లేదు కాబట్టి వీటితో మేలు కంటే కీడే జరిగే అవకా శాలే ఎక్కువని ఆర్‌‌‌‌‌‌బీఐ వాదిస్తోంది. అయితే డిజిటల్ కరెన్సీ పేపర్ కరెన్సీ మాదిరిగానే పనిచేస్తుంది. సాధారణ కరెన్సీతో డిజిటల్ రూపాయిని కొనుగోలు చేయొచ్చు.  డిజిటల్ రూపాయితో కరెన్సీని కొనుగోలు చేయొచ్చు.  సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీటులో డిజిటల్ రూపాయిని చూపిస్తారని ఫైనాన్షియల్ ఎనలిస్టులు అంటున్నారు.