
ముంబై: ఈ సంవత్సరం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి రికార్డు స్థాయిలో రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లిస్తామని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. ఇది 2023–-24లో చెల్లించిన దానికంటే 27.4 శాతం ఎక్కువ. ఆర్‌బీఐ 2023–-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. 2022–-23 సంవత్సరానికి చెల్లింపు రూ.87,416 కోట్లు ఉంది.
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 616వ సమావేశంలో డివిడెండ్ చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితులను కూడా బోర్డు సమీక్షించిందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 2024 ఏప్రిల్ - 2025 మార్చి మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై కూడా బోర్డు చర్చించింది.